కష్టకాలంలో చంద్రబాబుకి కొత్త బెంగ !

Chandrababu Naidu
గోరుచుట్టు మీద రోకలీపోటు అన్నట్టు తయారైంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి.  దూసుకుపోతున్న అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఢీకొట్టలేక, పార్టీని సంక్షోభం నుండి బయటకు లాగలేక చంద్రబాబు నానా అగచాట్లు పడుతున్నారు.  ఇంతకుముందులా వయసులో ఉంటే పరిస్థితి వచ్చింది వేరే.  కానీ మీదపడుతున్న వయసు మూలంగా అన్ని బాద్యతలను ఒక్కరే చూసుకోలేకపోతున్నారు.  తన రాజకీయ జీవితంలో ఎంతో మంది నాయకులను తయారుచేసిన ఘనత చంద్రబాబు సొంతం.  ఆయన తీర్చిదిద్దిన నాయకులంతా సీనియర్లు అయిపోయారు.  దీంతో పార్టీలో యువనాయకుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోంది.  
Chandrababu Naidu
Chandrababu Naidu
 
సీనియర్ నాయకులంతా ఏదో రకంగా అధికార పక్షం మీద పోరాటం సలుపుతూనే ఉన్నారు.  కేసులు మీద పడుతున్నా తెగించి మరీ పోరాడుతున్నారు.  కానీ ఆ తెగువ యువనాయకుల్లో మాత్రం కనబడటంలేదు.  ఒక్క ఎంపీ రామ్మోహన్ నాయుడు తప్ప మిగతా ఎవ్వరూ వైసీపీ మీద ఎదురుదాడి చేయలేకపోతున్నారు.  కనీసం తాము ఉన్నామని ఉనికిని చాటుకోలేకపోతున్నారు.  అమరావతి రైతుల సమస్యలు, మూడు రాజధానులు, ఫోన్ల ట్యాపింగ్, మరీ ముఖ్యంగా టీడీపీ సీనియర్ లీడర్ల మీద కేసులు, ఆరెస్టులు, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలు లాంటి విషయాల మీద కనీసం స్పందించడం లేదు.  ఇప్పటికే పార్టీ క్యాడర్ ఓటమి మూలంగా తీవ్ర నిరాశలో ఉంది.  వారిలో ఉత్సాహం నింపే పనులేవీ యువ నాయకులు చేయట్లేదు. 
 
ఇందుకు కారణం పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడమని కొందరంటే అధికార పక్షానికి భయపడి సైలెంట్ అయిపోయారని ఇంకొందరు అంటున్నారు.  ఈ కారణాలు నిజమైనా కాకపోయినా యువ నేతలు ఇలా మౌనంగా, ఎందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండి పోవడం మాత్రం సరైన పద్దతి కాదు.  కష్టాల్లో ఉన్నప్పుడే అండగా నిలబడేవారికి ప్రస్తుత కాలంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు కానీ భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయి.  ప్రజల్లో ముఖ్యంగా క్యాడర్లో ఒక డైనమిక్ గుర్తింపు వస్తుంది.  ఎదగాలి, నిలబడాలి అనుకునే ఎవరైనా ఈ కష్ట కాలాన్ని అవకాశంగా మలుచుకోవాలి.  ఇప్పటికైనా టీడీపీ యువ నాయకత్వం బయటికి వచ్చి పార్టీకి, అధినేత చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడాలి.