ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని అద్దంకులు ఉన్నా నిర్ణయంలో మార్పు ఉండదన్నట్టు జగన్ దూసుకుపోతున్నారు. అభివృద్ది ఫలాలు అన్ని జిల్లాలకు అందాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని, అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈమేరకు విశాఖకు పాలనా పరమైన శాఖలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టులో స్టేటస్ కో ఉంది కాబట్టి ఆగారు కానీ లేకపోతే ఈపాటికి శంఖుస్థాపన కూడ ముగించేవారు. ఈ ఆలస్యం కొన్ని రోజులేనని, రేపో మాపో మార్పు ఖాయమని అంటున్నారు.
ఇదిలా ఉంటే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో ప్రభావం చూపుతోంది. జగన్ పేరు చెప్పి కేసీఆర్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. వైఎస్ జగన్ ఎలాగైతే అన్ని జిల్లాల అభివృద్దికి మూడు రాజధానుల విధానాన్ని అనుసరిస్తున్నారో కేసీఆర్ కూడా అలాగే చేయాలని వి.హనుమంతరావు లాంటి సీనియర్ లీడర్లు కొందరు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాను రెండో రాజధానిగా చేయాలని కూడా అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఎలాగైతే అభివృద్ది మొత్తాన్ని ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేసి మిగతా జిల్లాలను విస్మరించారో కేసీఆర్ సైతం అలాగే హైదరాబాద్ సిటీ చుట్టూనే తిరుగుతూ మిగిలిన తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
అందుకే కేసీఆర్ కూడా జగన్ తరహాలో రెండు రాజధానుల విధానాన్ని పాటించాలని, కరీంనగర్ జిల్లాను రెండో రాజధానిగా ప్రకటించాలని అంటున్నారు. కొందరైతే పలు రాజధానుల ఆలోచన కేసీఆర్ మనసులో ఇదివరకే ఉందని అంటున్నారు. దీంతో జనంలో కూడా ఈ అంశం మీద ఆసక్తి పెరిగింది. ఇదే కేసీఆర్ కు ఇబ్బందిగా మారింది. నిజంగా ఆయన మనసులో రెండు రాజధానుల ఆలోచన ఉందో లేదో కానీ మెల్లగా వినిపిస్తున్న ఆ డిమాండ్ ఇలాగే వదిలేస్తే మరింత బలంగా మారే ప్రమాదం లేకపోలేదు.