తిరుపతి ఎఫెక్ట్: టీడీపీతో చేతులు కలపనున్న బీజేపీ.?

BJP To Join Hands With TDP

BJP To Join Hands With TDP

తిరుపతి ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద షాక్ తగులుతుందని భారతీయ జనతా పార్టీ అస్సలు ఊహించలేదు. తమ పార్టీని చూసి ఎవరూ ఓట్లెయ్యలేదనీ, జనసేన పార్టీ ఓట్లు మాత్రమే తమకు పడ్డాయనీ అంతర్గతంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చర్చించుకుంటున్నరాట. జనసేనకు చెందిన ఓట్లు కూడా పూర్తిస్థాయిలో పడకపోవడానికి బీజేపీ పట్ల వున్న వ్యతిరేకతే కారణమని కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి అధికార పీఠమెక్కేస్తామనే ధీమా నిన్న మొన్నటిదాకా వ్యక్తం చేసిన బీజేపీ, తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత పూర్తిగా చతికిలపడిపోయింది. డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఇప్పుడేం చేయాలి.? అన్న దిశగా బీజేపీ అధినాయకత్వం సమాలోచనలో పడిపోయిందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మాత్రమే, ఏపీలో బీజేపీ మనుగడకు మార్గమని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారట. టీడీపీ నుంచి చాలామంది నేతలు, వైసీపీలోకి వెళ్ళిపోయినా, బీజేపీ కొందరు రాజ్యసభ సభ్యుల్ని టీడీపీ నుంచి లాగేసినా, టీడీపీ ఓటు బ్యాంకు పదిలంగానే వుండడం బీజేపీ నాయకత్వాన్ని ఆశ్చర్యపరిచిందట.

పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ దెబ్బతిన్నట్టు కనిపించినా, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికొచ్చేసరికి, టీడీపీ తన పట్టు నిలబెట్టకుంది.. గెలవలేకపోయినాసరే. దాంతో, మిత్రపక్షం జనసేన సంగతెలా వున్నా, పాత మిత్రుడు చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడమే బెటర్.. అన్న ఆలోచనకి బీజేపీ దాదాపుగా వచ్చేసిందట. టీడీపీ – బీజేపీ మధ్య వైరం, స్నేహం.. కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు స్నేహం.. వైరం నడిచాయి. మళ్ళీ ఇంకోసారి స్నేహం కొత్తగా చిగురించడానికి పెద్దగా ఇరుపార్టీలకీ ఇబ్బంది వుండకపోవచ్చు. ఇద్దరికీ రాజకీయంగా అవసరం ఏర్పడినప్పుడు, ఈక్వేషన్ రాత్రికి రాత్రి మారిపోదా.?