తిరుపతి ఉప ఎన్నికల హోరు క్రమంగా పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రచారం షురూ చేసింది. పార్టీ ముఖ్య నేతలంతా ప్రత్యేకంగా సమావేశమై, తిరుపతి ఉప ఎన్నికల్లో బారీ మెజార్టీ సాధించడంపై చర్చించారు.. వ్యూహాలు ఖరారు చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ, మేం ఆలోచిస్తున్నది మెజార్టీ గురించే.. అన్నది వైసీపీ నేతల ధీమా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమా వైసీపీ ముఖ్య నేతలంతా తిరుపతి అభ్యర్థి గురుమూర్తితో కలిసి సమావేశం నిర్వహించారు, ప్రచార వ్యూహాల్ని ఖరారు చేశారు.
మరోపక్క వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు గ్రౌండ్ లెవల్‌లో ప్రచారం హోరెత్తించేస్తున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పుడిప్పుడే కొంత యాక్టివ్ అవుతున్నారు. టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం కూడా జోరుగా సాగుతోంది. ‘ఆటలో అరటి పండు’ చందాన భారతీయ జనతా పార్టీ నేతల హంగామా కూడా బాగానే కనిపిస్తోంది తిరుపతిలో. ఇదిలా వుంటే, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ సాధించబోయే మెజార్టీ గురించి అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి. కనీసం 5 లక్షల మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 4 లక్షలు మెజార్టీ ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తిరుపతిలో అందరికీ షాకిచ్చేలా తాము విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మాటల సంగతి పక్కన పెడితే, బెట్టింగులన్నీ వైసీపీ వైపే ఏకపక్షంగా కనిపిస్తున్నాయన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకూ ‘ప్రత్యేక హోదా’ సెగ తిరుపతిలో గట్టిగానే తగిలేలా వుంది. ‘ఇంకెప్పుడు ప్రత్యేక హోదా సాధిస్తారు.?’ అని ఓటర్లు తిరుపతిలో వివిద రాజకీయ పార్టీల్ని ప్రశ్నిస్తుండడం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం.