ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికకు నగారా మోగనుంది. అనుకోకుండా దురదృష్టవశాత్తు, తిరుపతి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఖాళీ అయిన సీటును భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో, ఏపీ రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందనేది కొందరి వాదన. నాడు ఆంధ్రా రాజధానిగా అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ వైసీపీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. అలాగే మరోవైపు జగన్ సర్కార్ పాలనలో, సరైన మద్యం దొరకడంలేదని, ఇసుక కొరత, దళితుల పై దాడలు, పాలన వదిలేసిన వైసీపీ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని,సంక్షేమ పథకాల పేరుతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.
ఇక ముఖ్యంగా టీడీపీ హయాంలో రాజధానికి అమరావతిని ఎంపిక చేస్తే, జగన్ ప్రభుత్వం దీన్ని విశాఖపట్నానికి మారుస్తున్నారని, దీంతో ఒకవైపు రాజధానికోసం భూములు ఇచ్చిన వారిని మోసం చేయడమే కాకుండా, మరోవైపు రాయలసీమ ప్రాంతానికి కూడా అన్యాయం చేస్తున్నరాని టీడీపీ నేతలు వాధిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పినందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అండ్ టీడీపీ తమ్ముళ్ళు సవాళ్ళు విసురుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇదే. దీంతో సహజంగానే అందరి చూపు ఇప్పుడు ఈ ఉప ఎన్నిక పై పడుతోంది. మరోవైపు చంద్రబాబు సొంత జిల్లాలోని నియోజకవర్గం కావడంతో, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక రసవత్తరంగా జరగనుంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు అండ్ బ్రదర్స్ చెబుతున్నట్లు, మూడు రాజధానుల అంశం, జగన్ సర్కార్ పాలనకు వ్యతిరేకంగా తిరుపతి లోక్‌సభ ఎన్నిక ఫలితం వస్తుందా లేక, ఇచ్చిన మాట ప్రకారం కష్టకాలంలో కూడా ప్రజల కోసం సంక్షేమ పథకాల్ని ఏ మాత్రం విస్మరించకుండా, అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంకు అనుకూలంగా ఫలితం వస్తుందా అనేది ఇప్పుడు ఆశక్తి కరంగా మారింది. ఏది ఏమైనా ఒకవైపు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మరోవైపు యంగ్ సీయం జగన్ మధ్య తిరుపతి ఉప ఎన్నిక తాడోపేడో తేల్చ నుందని, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్ని మార్చనుందని రాజకీయాల్లో రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.