తిరుపతి బై పోల్: రికార్డు మెజార్టీపైనే వైసీపీ ఫోకస్.!

jaganmohan reddy

jaganmohan reddy

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక ఇది. నిజానికి, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే. విపక్షాలేవీ అధికార పార్టీకి పోటీ ఇచ్చే స్థాయి బలంతో లేవు. టీడీపీ అందరికన్నా ముందు అభ్యర్థిని ప్రకటించినా, ఆ అభ్యర్థి ఇప్పటిదాకా రంగంలోకి దిగలేదు.

బీజేపీ కింది స్థాయిలో పని మొదలు పెట్టినా, ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. పైగా మిత్రపక్షం జనసేనతో బీజేపీకి అంతర్గతంగా సమస్యలున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రాగానే, వైసీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడైన డాక్టర్ గురుమూర్తిని వైసీపీ బరిలోకి దింపుతోంది. సిట్టింగ్ స్థానం తమదే గనుక, గెలవడం పెద్ద కష్టమేమీ కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ గెలుపుతో రాష్ట్రంలో విపక్షాలకు గట్టి మెసేజ్ ఇవ్వాలన్నది జగన్ సంకల్పంగా కనిపిస్తోంది. భారీ మెజార్టీతో గురుమూర్తి గెలవాలి.. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి.. అని పార్టీకి చెందిన ముఖ్య నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లాకి చెందిన మంత్రులు, పలువురు ముఖ్య నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తిరుపతి ఉప ఎన్నిక విషయమై స్థానిక పరిస్థితుల్ని నివేదించడంతో, ఆ నివేదిక చూసి ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారట. ‘అస్సలేమాత్రం అలసత్వం వద్దు. గెలిచేస్తామన్న ధీమా అసలే వద్దు.

భారీ మెజార్టీ దిశగా కష్టపడండి. తిరుపతి మెజార్టీ ఇతర రాజకీయ పార్టీలకు ఘాటైన సమాధానం ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సంకేతం ఇవ్వాలి..’ అంటూ వైఎస్ జగన్, పార్టీ ముఖ్య నేతలకు చెప్పారట.