తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా.? బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారా.? అన్నదానిపై గత కొద్ది కాలంగా ఇరు పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే, మొదటి నుంచీ బీజేపీ.. తమ అభ్యర్థినే బరిలోకి దింపాలనే ఆలోచనతో వుంది. ఆ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు తదితరులు గతంలోనే ప్రకటించేశారు. అది కాస్తా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఆగ్రహం తెప్పించింది, అసహనం కలిగించింది.
ఢిల్లీకి వెళ్ళారు.. తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించారు. అయితే, పెద్దగా మార్పు ఏమీ లేదు. మధ్యలో చిన్న ‘పాజ్’ అంతే. ఈ సమయంలో ‘చర్చలు జరుపుతున్నట్లు’ హడావిడి నడిచింది. తాజాగా సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ చర్చించి, నిర్ణయం తీసేసుకున్నారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని తేలిపోయింది. ఈ విషయాన్ని ఇటు జనసేన, అటు బీజేపీ ప్రకటించేశాయి. ఇంతకీ బరిలోకి దిగే బీజేపీ అభ్యర్థి ఎవరు.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. కాగా, జనసేన చాలా తెలివిగా, చాలా ముందు చూపుతో వ్యవహరించిందనీ, తిరుపతిలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే, మిత్రపక్షానికి ఆ అవకాశం వదిలేస్తే మంచిదన్న కోణంలో జనసేన లైట్ తీసుకుందనీ ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనసేన తన ఉనికిని గట్టిగానే చాటుకుంది బీజేపీతో పోల్చితే. అలాంటప్పుడు తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీ చేస్తే ఏం లాభం.? ఏమో, బీజేపీ ఈక్వేషన్లు ఎలా వున్నాయో.!