ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల జోష్ ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది అధికార పార్టీ. వరుసగా మూడో విజయంతో తీన్మార్ ఆడాలని ఆశిస్తోంది. తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. హ్యట్రిక్ కొట్టి తీరుతామంటున్నారు నేతలు.. ఈ ఉప ఎన్నికలో విజయం తమదేనని మంత్రులు ముందే ఫిక్స్ అయ్యారు. అయితే అతి విశ్వాసానికి పోకుండా విజయం సాధించాలని మంత్రులకు చెప్పిన సీఎం జగన్.. వారి ముందు ఒక టార్గెట్ ఫిక్స్ చేశారంట. ఆ టార్గెట్ కచ్చితంగా రీచ్ అవ్వాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓ వైపు గెలుస్తామని ధీమా ఉన్నా.. అధినేత ఫిక్స్ చేసిన టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీనా అని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత.. తిరుపతి ఉపఎన్నికలో గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని వైసీపీ ప్రకటించింది. రాజకీయాలకు కొత్త.. ఉన్నత విద్యావంతుడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై పాజిటివ్ టాక్ ఉందని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. లాభ నష్టాలతో బేరీజు లేకుండా సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నా సానుకూల అంశం కూడా గురుమూర్తికి భారీ మెజార్టీ తీసుకొస్తుందని స్థానిక నేతలు, మంత్రులు అంచనా వేస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్ చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. తిరుపతికి పేర్ని నాని, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డి, సత్యవేడు కొడాలి నాని, సూళ్లూరు పేటకు కన్నబాబు, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, గూడూరుకు అనిల్ కుమార్ యాదవ్ లను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఓవరాల్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లకు కట్టబెట్టారు. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో కనీసం 4 లక్షల మెజారిటీ తగ్గకుండా సాధించాలని సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.