తిరుపతి ఉప ఎన్నిక: వైసీపీ ‘ఆ అస్త్రాల్ని’ ప్రయోగిస్తుందా.?

Tirupathi Parliament By-Polls, YSRCP strategies

తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజుకున్నట్టే రాజుకుని, అంతలోనే చల్లారిపోయింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనూ తిరుపతి ఉప ఎన్నిక వేడి తగ్గడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది.

YSRCP and TDP flags
Tirupathi Parliament By-Polls, YSRCP strategies

అయితే, నివర్‌ తుపాను నేపథ్యంలో రాజకీయ వేడి తగ్గింది తప్ప, దానికి వక్ర భాష్యాలు తీయడం సరికాదనే వాదన బీజేపీ నుంచి వినిపిస్తున్నప్పటికీ, అభ్యర్థి ఎవరన్నదానిపై స్పష్టత లేకపోవడంతోనే బీజేపీ, జనసేన తిరుపతి ఉప ఎన్నిక విషయమై ‘సందడి’ తగ్గించాయనే వాదన లేకపోలేదు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల లెక్కల ప్రకారం చూసుకుంటే, ఇటు బీజేపీ కావొచ్చు, అటు జనసేన కావొచ్చు.. అంతగా అత్యుత్సాహం చెందాల్సిన అవసమే లేదు. అయితే, దుబ్బాక ఉప ఎన్నిక జోరు నేపథ్యంలో బీజేపీ మాత్రం అత్యుత్సాహం చూపుతోంది. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలొచ్చాక ఆ జోరు ఎలా వుంటుందో ఇప్పుడే చెప్పలేం.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అస్త్రాలేంటి.?

అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక మరీ అంత అగ్ని పరీక్ష ఏమీ కాదు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు ఎడ్జ్‌ వుంటుంది. తెలంగాణలో అది తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కవుట్‌ కాలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేరు. పైగా, ఏపీలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ)కి సరైన ప్రత్యర్థి లేరన్నది నిర్వివాదాంశం. తెలుగుదేశం పార్టీనే ప్రధాన ప్రతిపక్షం. అయితే, ఆ పార్టీ గడచిన ఏడాదిన్నర కాలంలో వైసీపీ వ్యూహాల కారణంగా పూర్తిగా నీరసించిపోయింది. ఇక, వైసీపీ అస్త్రాల విషయానికొస్తే, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఆ పార్టీకి అత్యద్భుతమైన ఫాలోయింగ్‌ వుంది. పైగా, మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలు, రాయలసీమ ప్రాంతంలోనే వుంది. దీనికి తోడు, సెంటిమెంట్‌ మరో ప్రధాన అస్త్రం. సిట్టింగ్‌ ఎంపీ మృతితో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ఆ సెంటిమెంట్‌ వైసీపీకే కలిసొస్తుంది.

ప్రత్యేక హోదా అసలు సిసలు బ్రహ్మాస్త్రం

తిరుపతి సాక్షిగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, 2014 ఎన్నికల ప్రచారంలో (అప్పటికి ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు) ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ హోదాని తుంగలో తొక్కేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ పాపం చంద్రబాబుదేనని వైసీపీ ఇప్పటికీ ఆరోపిస్తుంటుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న దరిమిలా, ఆ ప్రత్యేక హోదా అంశం ఇంకోసారి ఎన్నికల అస్త్రంగా మారే అవకాశం ఖచ్చితంగా వుంటుంది. అది కూడా అధికార పార్టీ వైసీపీకే అడ్వాంటేజ్‌ అవుతుంది. ఎటూ బీజేపీ, వైసీపీ ప్రశ్నకు ప్రత్యేక హోదా విషయమై సమాధానమిచ్చే పరిస్థితి వుండదు.

వైసీపీ చాపకింద నీరులా చక్కబెట్టేస్తోందా.?

పైకి, తిరుపతి ఉప ఎన్నిక గురించి ఏమాత్రం ఆలోచించడంలేదన్నట్టే కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుకాల మాత్రం వైసీపీ, గ్రౌండ్‌ లెవల్‌లో చాలా వ్యవహారాల్ని చక్కబెట్టేస్తోంది. ఎమ్మెల్యేల్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది వైసీపీ. కొందరు సీనియర్‌ మంత్రులూ అక్కడే మకాం వేశారు. నోటిఫికేషన్‌ వచ్చేలోపు, పూర్తిస్థాయిలో వైసీపీ తన ఏర్పాట్లను ఓ కొలిక్కి తెచ్చేస్తుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి ఇక్కడి నుంచి పోటీ చేయనుండగా, ఆమెకి ఈసారి కూడా తిరుపతిలో చుక్కెదురవడం ఖాయమైపోయిందనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది.