తిరుపతి ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఐఏఎస్ అదికారిణి రత్నప్రభను కమలదళం, తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఆసక్తికరమైన అంశమేంటంటే, రత్నప్రభ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని కావడం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించాక, వైఎస్సార్ మరణాన్ని గుర్తు చేస్తూ, ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తన ట్వీట్ ద్వారా రత్నప్రభ. అంతే కాదు, ‘వైఎస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందిప్పుడు..’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారామె.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకమైన పదవిని ఆశించారని అప్పట్లో రత్నప్రభ గురించి ప్రచారం జరిగింది కూడా. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే, తిరుపతి ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, చివరి నిమిషం వరకు అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగించి, చివరకు సత్యప్రభ పేరు ఖరారు చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. రత్నప్రభ ఎంపిక పట్ల కింది స్థాయిలో బీజేపీ కార్యకర్తలకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. మిత్రపక్షం జనసేన సైతం ఈ విషయంలో కొంత ఆశ్చర్యపోవాల్సి వచ్చిందట. తిరుపతిలో బీజేపీ గెలవాలనుకుంటోందా.? వైసీపీకి అఖండమైన మెజార్టీని అప్పగించాలనుకుంటోందా.? అని ఇటు బీజేపీ మద్దతుదారుల్లో కొందరు, అటు జనసేన అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
మరోపక్క వైసీపీ అభిమానులు, బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు తమకు బీజేపీ నుంచి పరోక్షంగా సహకారం అందుతోందన్న భావనలో. మొదటి నుంచీ తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ వ్యూహాలు అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. బీజేపీ కంటే చాలా మెరుగైన ఓటు బ్యాంకు వున్న మిత్రపక్షం జనసేనను కాదని, తమ అభ్యర్థినే నిలబెట్టాలనే బీజేపీ తాపత్రయం వెనుక అసలు కారణం వైసీపీకి మేలు చేయడమేనా.? అన్న వాదన వినిపిస్తోంది.