తిరుపతి ఉప ఎన్నిక రిజల్ట్: అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరికినట్టేనా.?

Tirupati By Election

Tirupati By Election

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. రెండు లక్షల డెబ్భయ్ వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలిచేశారు. నిజానికి, ఈ గెలుపుతో వైసీపీకి కలిగిన అదనపు లాభం ఏమీ లేదు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుందంతే. 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు (లోక్ సభ) వైసీపీకి దక్కారు. అందులో ఒకరు బల్లి దుర్గా ప్రసాద్. తిరుపతి నుంచి గెలిచిన దుర్గా ప్రసాద్, గత ఏడాది కరోనా కారణంగా అకాలమరణం చెందారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి దూరంగా వున్నారు. సో, వైసీపీతో నిఖార్సుగా వున్న ఎంపీల సంఖ్య 22లో ఇంకా ఒకటి తక్కువ వున్నట్టే. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా రాజకీయంగా లాభపడదామనుకున్న బీజేపీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తెలుగుదేశం పార్టీ తన పట్టు కాస్త నిలబెట్టుకున్నట్టే వుంది. మరీ దారుణమైన డ్యామేజీ టీడీపీ ఓటు బ్యాంకుకి జరగలేదు. అంటే, జగన్ సర్కార్ తెరపైకి తెచ్చిన సంక్షేమ పథకాలేవీ తిరుపతి ఉప ఎన్నికపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని అనుకోవాలేమో. విపక్షాలు ఆరోపిస్తున్న స్థాయిలో రెండు లక్షలు ఆ పైన దొంగ ఓట్లు పోలయ్యాయని అనలేం. కానీ, కొన్ని దొంగ ఓట్లు పోలయ్యాయి.. అదీ వైసీపీకే పడ్డాయి.. అది అందరికీ మీడియా సాక్షిగా కనిపించింది కూడా. ఆ లెక్కన, వైసీపీ సాధించిన ఘనవిజయమేమీ లేదిక్కడ. ఈ విషయమై పోస్టుమార్టం చేయాల్సిన బాధ్యత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుంది. నిజానికి, 5 లక్షల మెజార్టీ ఆశించారు వైఎస్ జగన్. వైసీపీ హయాంలో తెరపైకి వచ్చిన సంక్షేమ పథకాల నేపథ్యంలో ఆ మెజార్టీ వచ్చి వుండాలి. పైగా, విపక్షాలేవీ బలంగా లేవు రాష్ట్రంలో. మరి, ఎక్కడ వ్యవహారం తేడా కొట్టేసింది.? ఇదే ఇప్పుడు వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు హడావిడి చేసినా, గెలుపు ఉత్సాహాన్ని ఇంకా గట్టిగా వైసీపీ నేతలు చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం, ‘ఇలా జరిగిందేంటి చెప్మా?’ అనే ప్రశ్నే రౌండ్లు కొడుతోందట.