Three Capitals Issue : మూడో ముచ్చట.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందే.!

Three Capitals Issue: ఒకటి కాదు, రెండు కాదు.. మూడు రాజధానులంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ. మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని అధికార వైసీపీ బలంగా నమ్ముతోంది. ఆయా రాజకీయ పార్టీలు తమ తమ విధానాల్ని బాహాటంగా చెప్పడం, అధికారంలో వున్నప్పుడు వాటిని అమలు పర్చాలనుకోవడం వింతేమీ కాదు.

అయితే, రాష్ట్రానికి ఏది మంచిది.? అన్న విషయమై ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు విజన్ వుండి తీరాలి. నిజమే, మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమే. కానీ, ఎప్పుడు.? ఆ మూడు రాజధానుల కోసం ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయగలిగినప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పరిస్థితి వుందా.?

పొద్దున్న లేస్తే అప్పు కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అని తిరగాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్రా ష్ట్రానిది. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల ముచ్చట రాష్ట్రానికి అస్సలేమాత్రం మంచిది కాదు. అలాగని, అమరావతి మీద చంద్రబాబు హయాంలో చెప్పబడినట్లు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితీ లేదు. మరేం చేయాలి.?

ప్రస్తుతానికైతే వున్నదాంతోనే సరిపెట్టుకోవాలి. రాష్ట్రానికి ప్రస్తుతానికైతే వున్న ఏకైక రాజధాని అమరావతి. అందులోనే, అందుబాటులో వున్న భవనాల్ని రాజధాని కోసం మరింత వీలుగా వినియోగించుకోవాలి. నిర్మాణంలో వున్న భవనాల్ని పూర్తి చేసుకోవాలి. ఇదే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.

రాయలసీమ మేధావులో, ఉత్తరాంధ్ర మేధావులో.. ఇలా ఏదో ఒక పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకే ఇబ్బందికరం. అధికారంలో వున్నోళ్ళు ఇలాంటి సందర్భాల్లోనే చాకచక్యంగా వ్యవహరించాలి. కానీ, ఆ విజ్ఞత అధికార పార్టీలో కనిపించడంలేదు.