YS Jagan a Strategy : ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంలో అడుగు ముందుకు పడే పరిస్థితి కనిపించడంలేదు. ‘మేం మూడు రాజధానులకు కట్టుబడి వున్నాం..’ అని వైసీపీ ఘంటాపథంగా చెబుతున్నా, అందుకు అనుకూలమైన పరిస్థితులైతే లేవు. మా ప్రాంతంలో రాజధాని కావాలంటూ విశాఖ వాసులుగానీ, కర్నూలు వాసులు గానీ గతంలోలా ఉద్యమాలు చేయకపోవడం పట్ల వైసీపీలో అంతర్మధనం జరుగుతోంది.
కోర్టు వివాదాలు సహా అనేక సమస్యల కారణంగా మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తీసుకుంది. తాము తీసుకున్న విధానపరమైన నిర్ణయం పట్ల గట్టిగా నిలబడి, న్యాయ పోరాటం చేయాల్సింది పోయి, న్యాయస్థానాల ముందర చేతులెత్తేసి.. తిరిగి చట్ట సభల్లో న్యాయ వ్యవస్థ గురించి చర్చ పేరుతో రచ్చ చేసి కొత్త వివాదానికి ఆస్కారమిచ్చింది వైసీపీ.
దాంతో, సమీప భవిష్యత్తులో మూడు రాజధానుల అంవం ముందుకు కదిలేలా లేదన్ని రాజకీయ విశ్లేషకుల వాదన. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్న కోణంలో.. వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని వచ్చే ఎన్నికల వరకు సాగదీస్తూ వుంటుందా.? అన్న అనుమానాలైతే పెరుగుతున్నాయి.
ఇందులో అనుమానపడటానికేమీ లేదు. అదే జరగబోతోంది కూడా. ఇదిలా వుంటే, జిల్లాల విభజన, మంత్రి వర్గ విస్తరణ.. ఈ వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చాక, మూడు రాజధానుల అంశంపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమీక్ష జరుపుతారనే ప్రచారం జరుగుతోంది.