తెలుగుదేశం పార్టీ నుండి అధికార వైసీపీలో వలసలు ఇంకా పెరగడానికి ప్రధాన కారణం కేసుల భయం. గతంలో కేసులు మీదపడిన టీడీపీ నేతలు చాలామందికి జగన్ అధికారంలోకి రాగానే భయం పట్టుకుంది. పైగా జగన్ అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న నేతలను వదిలేది లేదని చెప్పడం, వరుసగా టీడీపీ పెద్ద తలలు జేసీ, అచ్చెన్నాయుడు లాంటి వారి మీద కేసులు పడటంతో బెదిరిన చాలామంది నేతలు వైసీపీలోకి వెళ్లిపోవడం బెటర్ అనుకుని ఆ టర్న్ తీసుకున్నారు. వైసీపీలో ఆధిపత్య పోరు విపరీతంగా ఉన్నా, తమకు విలువ ఉండదని తెలిసినా స్వీయ రక్షణ కోసం పార్టీ మారారు. అలా మారిన వారిలో తోట త్రిమూర్తులు కూడ ఒకరు.
చాలా ఏళ్ల క్రితం తోట త్రిమూర్తుల మీద దళితులకు శిరోముండనం చేసిన కేసు నమోదైంది. అందులో ఆయన ఏ 1గా ఉన్నారు. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతూనే ఉంది. తోట త్రిమూర్తులు తన పలుకుబడి ఉపయోగించి కేసు ప్రభావం తన మీద పడకుండా చూసుకున్నారు కానీ కేసును ఎత్తివేయించుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కేసునే వైసీపీ నేతలు బయటకు లాగారు. లాగింది మరెవరో కాదు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్, త్రిమూర్తుల నడుమ ఉన్న రాజకీయ విబేధాలు ఈనాటివి కావు. రామచంద్రాపురంలో ఇరువురు తరాలు తరబడి ఆధిపత్యం కోసం పోటీపడుతూనే ఉన్నారు. ఇరువురు సమఉజ్జీలే కావడంతో పోరు తీవ్రంగా ఉండేది.
గత ఎన్నికల్లో త్రిమూర్తులు ఓడిపోవడం, పిల్లి సుభాష్ రాజ్యసభ సభ్యుడిగా ఎదగడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. త్రిమూర్తులు చేసేది లేక వైసీపీతో చేతులు కలిపారు. అయినా ఆయనకు రక్షణ లేకుండా పోయింది. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని పిల్లి సుభాష్ హోంమంత్రికి లేఖ రాసి సంచలనం రేపారు. దళితుల శిరోముండనం కేసులో ఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని, 20 ఏళ్లుగా కేసు తేలకుండా పలుకుబడితో విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేని నిస్సహాయులని అన్నారు. ఈ తంతు మొత్తం చూస్తున్న టీడీపీ వర్గాలు అధిష్టానం అనుమతి లేకుండానే పిల్లి సుభాష్ ఇంత దూరం వెళతారా అంటూ మార్లాడుకుంటున్నారు.