పార్టీలో చేరేవారు రూ. 25 వేలు చెల్లించాలి : కమల్ హాసన్

సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు.

పార్టీలో చేరేందుకు 25 వేలు చెల్లించాలి: క‌మ‌ల్ హాస‌న్

పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం క‌మ‌ల్ బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌తో పోటీ చేయ‌నున్నారు. కొద్ది రోజుల క్రితం క‌మ‌ల్ త‌న కాలుకు శ‌స్త్ర చికిత్స చేయించుకోగా, ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. వ‌చ్చే నెల నుండి పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయ‌న పార్టీ పోటీ చేయ‌నుంద‌ని క‌మ‌ల్ గతంలోనే స్ప‌ష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య హోరాహోరీ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, కమల్ హాసన్ కూడా ఇతర పార్టీలతో కలసి ఆ రెండు పార్టీలను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పలు హామీలు గుప్పించింది. ప్రభుత్వ నిర్వహణ ఆర్థిక ఎజెండా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏడు అంశాల్ని పొందుపరిచారు. తాను అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమేమి చేయనున్నారో తెలిపారు. గ్రీన్ ఛానల్ ప్రభుత్వాన్ని సృష్టిస్తామని.. దీని ద్వారా చట్టబద్ధమైన ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. పౌరులు ఎక్కడికి వెళ్లకుండానే దరఖాస్తు చేసుకునేలా ఆన్ లైన్ హోంలను క్రియేట్ చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఇంటికి కంప్యూటర్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనున్నట్టు వివరించారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం భార‌తీయుడు 2 చిత్రం మొద‌లు పెట్టిన క‌మ‌ల్ ఈ మూవీని ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత పూర్తి చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.