నాలుగు వారాల్లో రంగులు మార్చాలని సుప్రీంకోర్టు జగన్ సర్కార్ కిషాకిచ్చిన సంగతి తెలిసిందే. సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలకు వేసిన పార్టీ రంగులను తొలగించి మామూలు రంగులు వేయాలని సూచించింది. అదీ సరిగ్గా నాలుగు వారాల గడువులో ఆ పనులు మొత్తం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రంగుల తతంగం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చేసింది. కానీ ఇక్కడ ఎదైనా తేడా జరిగితే రంగు పడేది మాత్రం ఆ ముగ్గరు అధికారులపై మాత్రమే. కోర్టులో బుక్కయ్యేది ఆ ముగ్గురే. అదీ సాదాసీదా అధికారులు అయితే కాదు. ముగ్గురు ఐఏఎస్ అధికారులే. దీంతో ఇప్పుడా అధికారుల గుండెల్లో రంగుల రైళ్లు పడిగెడుతున్నాయి.
వేసిన రంగులు తీసేయాలంటే సీఎం అనుమతి తీసుకోవాలి. ఆయనేమో మనసులో మాట స్పష్టంగా బయట పెట్టడం లేదు. ఏ రంగు వేయాలో చెప్పడం లేదు. తెలుపు రంగు వేద్దామంటే అంగీకరించడం లేదు. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. అయితే చాలాచోట్ల తెలుపు రంగుతో చేసిన తప్పిదాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ గనుక సీఎం ఏదో రంగు చెప్పి వేసేయమన్నా..మళ్లీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే అదో పంచాయతీ అవుతుంది. మళ్లీ ఆ ముగ్గురే బాధ్యులవుతారు.
కేవలం కోర్టుకు అసలు విషయం చెప్పకపోవడం వల్లే వచ్చే తంట ఇదంతా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, పంచాయతీ రాజ్ శాఖాదిపతి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ లు తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాలి. అందుకే ఈ ముగ్గురికే రంగుల విషయంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాలుగు వారాల గడువులో ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఉన్న కొద్ది రోజుల్లో రంగులు మార్చేసి..కోర్టు ధిక్కరణ కాకుండా ఉంటే ఆ ముగ్గురు సేఫ్ అయినట్లే. లేదంటే మళ్లీ అక్షింతలు తప్పవు.