ఆంధ్రపదేశ్ రాష్ట్రం, పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయమై అస్సలేమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. సర్వోన్నత న్యాయస్థానం వివిధ రాష్ట్రాల్లో పరీక్షల నిర్వహణపై ఘాటైన వ్యాఖ్యలు చేసినా సరే, తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం వైపే మొగ్గు చూపుతోంది వైఎస్ జగన్ సర్కార్. అయితే, విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు మాత్రం.. పరీక్షల నిర్వహణ విషయంలో ససేమిరా అంటున్నారు.
రోజురోజుకీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇది ఖచ్చితంగా అధికార వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరమైన విషయమే. ఏ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు పెడతామని ప్రభుత్వం చెబుతోందో.. ఆ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులే, పరీక్షలు వద్దు.. ప్రాణాలే ముద్దు.. అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రాణం పోయినా.. దానికి వెల కట్టలేం.
టీడీపీ నిలదీసింది కాబట్టి.. పరీక్షలు ఆపకూడదు.. నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం అనుకుంటే.. అది చారిత్రక తప్పిదమే అవుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జులై నెలాఖరులో పరీక్షలు పెట్టాలనే ఆలోచనతో వుంది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం. వేగంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయనే విషయాన్ని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ రూపంలో ఏపీ ప్రభుత్వం తెలియజేసింది కూడా.
కానీ, ఇది కోర్టు సమస్య కాదు.. రాజకీయ సమస్య అసలే కాదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రాణాలకు సంబంధించిన అంశం. ఏ చిన్న పొరపాటు దొర్లినా.. నష్టం ఊహించని విధంగా వుంటుంది. రేప్పొద్దున్న పరీక్షల కారణంగానే విద్యార్థుల ప్రాణాలు పోయాయన్న మాట బయటకు వచ్చిందంటే.. జీవిత కాలం చెరిపేసుకోలేని మచ్చ అవుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.