నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి పెట్రో ధరల విషయంలో. దేశంలో పెట్రో ధరలు సెంచరీ దాటేశాయి. డబుల్ సెంచరీ అతి త్వరలో కొట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంత వేగంగా ధరలు పెరుగుతున్నాయ్ మరి.
అసలు దేశంలో పెట్రోధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి.? అంటే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరగడం వల్లేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సెలవిచ్చారు. ప్రస్తుతం 70 డాలర్లకు బ్యారెల్ ముడి చమురు ధర పెరగడం వల్లే దేశంలో పెట్రోధరలు పెరుగుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. కానీ, యూపీఏ హయాంలో.. అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడు 100 డాలర్ల పైన బ్యారెల్ ముడి చమురు ధర పలికింది.
అప్పట్లో పెట్రో ధరలు ఇంతలా పెరగలేదు. అసలు 90 రూపాయల్నే టచ్ చేయలేదు లీటర్ పెట్రోల్ ధర. కానీ, ఇప్పుడు అప్పటితో పోల్చితే (అప్పట్లో అత్యధికం 120 డాలర్ల పైన పెరిగింది) ఇప్పుడు సగం ధరకే బ్యారెల్ ముడి చమురు ధర పలుకుతోంది. నిజానికి, పెట్రోల్ వాస్తవ ధర చాలా తక్కువే. దానికి రకరకాల పన్నుల్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలూ జోడించేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పన్నుల్ని పెంచుకుంటూ పోతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
ఈ దోపిడీకి ఆకాశమే హద్దు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. దేశమంతా కరోనాతో విలవిల్లాడుతోంటే, కేంద్రం.. పెట్రో ధరలు పెంచుకుంటూ పోతోంది.. ఏమన్నా అంటే, పెట్రో ధరల అంశం ప్రభుత్వానికి సంబంధం లేదు.. చమురు శుద్ధి సంస్థలు పెంచుతున్నాయ్.. అంటూ సన్నాయి నొక్కులు మామూలే అయిపోయాయి. నిజానికి, రెండు మూడు నెలల తర్వాత పెట్రో ధరలు తగ్గుతాయని, రెండు మూడు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. తగ్గలేదు సరికదా.. ఇప్పుడు షాక్ ఇచ్చేస్తున్నాయ్.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోధరల్ని తీసుకొస్తే, పెట్రోల్ ధర సగానికి తగ్గుతుంది. కానీ, అందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడంలేదని ఇంకో కుంటి సాకు చెబుతోంది కేంద్రం. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అన్నీ చేస్తున్నారా.? పెద్ద నోట్లు రద్దు కూడా అలాగే చేశారా.?