వైసీపీ వైజాగ్ స్టీల్ పోరాటం: ఇంతకీ కొనుగోలు సంగతేంటట.?

Modi's Govt Selling Vizag Steel, Will AP Buy?

Modi's Govt Selling Vizag Steel, Will AP Buy?

అసలంటూ అమ్మకందాకా వస్తే కదా, కొనుగోలు గురించిన చర్చ.. అనడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, విశాఖపట్నం స్టీలు ప్లాంటుని అమ్మెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ దిశగా ముందడుగు వేసేసింది కూడా. కానీ, ఏపీ బీజేపీ మాత్రం, విశాఖ స్టీలు ప్లాంటు అమ్మే ప్రసక్తే లేదని చెబుతోంది.

విశాఖ స్టీలు ప్లాంటుని ప్రైవేటు పరం కానివ్వబోమని తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా వుంటే, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, అసెంబ్లీలో తీర్మానించింది ఇప్పటికే.

తాజాగా వైసీపీ ముఖ్య నేతలు, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తీరుని తప్పుపట్టారు. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. పార్లమెంటు వేదికగా మోడీ సర్కారుపై పోరాటం చేస్తామంటున్నారు.

పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేసేందుకు సైతం వెనుకాడబోమని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్లమెంటులో సంపూర్ణ బలం వున్నంతమాత్రాన అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటామంటే ఊరుకునేది లేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే, ఇవన్నీ ఏపీలో వినిపించే తాటాకు చప్పుళ్ళగానే చూడాలా.? లేదంటే, పార్లమెంటు వేదికగా చిత్తశుద్ధితోనే వైసీపీ పోరాటం చేస్తుందా.? అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.

విశాఖ స్టీలు ప్లాంటుని పరిరక్షించుకుంటామంటూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తెగేసి చెబుతున్నాయి. ఢిల్లీ వేదికగా పోరాటానికి సిద్ధమంటున్నాయి. ఆ పోరాటానికి వైసీపీ మద్దతు పలికిన దరిమిలా, ఉద్యమం తీవ్రతరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, కేంద్రంలోని మోడీ సర్కార్.. ఇలాంటి ఆందోళనల్ని లైట్ తీసుకోవడంలో వింతేమీ వుండకపోవచ్చు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లతో కేంద్రానికి అస్సలు సంబంధం వుండదు. పైగా, ఆంధ్రప్రదేశ్ అంటే, కేంద్రంలో ఎవరున్నాసరే కాస్తంత చులకన ఎక్కువ.