ప్రతినెలా అప్పులు చేస్తే తప్ప, రాష్ట్రం అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదన్నది గత కొద్ది నెలలుగా.. ఆ మాటకొస్తే, రెండేళ్ళుగా తెలుగు మీడియాలో కనిపిస్తోన్న కథనాల సారాంశం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతోనే ఈ దుస్థితి మొదలైంది.
అప్పటినుంచి ఇప్పటిదాకా ‘అంతకు మించి’ అప్పలు చేయడం మినహా, రాష్ట్రానికి మరో దారి కనిపించడంలేదు. చంద్రబాబు హయాంలోనూ అప్పుల పండగే, ఇప్పుడూ అంతకు మించిన అప్పుల పండగే.
కరోనా నేపథ్యంలో అప్పుల జాతర మరింత ఎక్కువైంది. అప్పులు దొరకడం నానాటికీ కష్టంగా మారిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. ‘అబ్బే, జరుగుతున్న ప్రచారమంతా నిజం కాదు..’ అని చెప్పగలుగుతున్న జగన్ సర్కారు, అప్పులు చేయడంలేదని మాత్రం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే, అప్పులు జరుగుతున్నది వాస్తవం.
అప్పులు లేకపోతే రాష్ట్రం ముందడుగు వేయలేని పరిస్థితీ వాస్తవం. కానీ, ఎన్నాళ్ళిలా.? సంక్షేమ పథకాలే కరోనా పాండమిక్ సమయంలో పేదల్ని ఆదుకున్నాయన్నది నిర్వివాదాంశం.
ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ, కరోనా పాండమిక్ ఇప్పట్లో ముగిసేలా లేదు. మరెలా రాష్ట్రం ముందడుగు వేయగలుగుతుంది.? ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అయితే, తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వనరులున్నాయి.
ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదు. ముందు ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా వుంటుందోగానీ.. రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రానున్నది రాజకీయంగా గడ్డు కాలమేనన్నది నిర్వివాదాంశం. ఓ వైపు విపక్షాల నుంచి పోటు, ఇంకో వైపు.. ఆర్థిక సంక్షోభం వెరసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకు విషమ పరీక్ష రాబోతోందన్నమాట.