శాసన మండలి రద్దుపై ‘మడమ తిప్పిన’ సీఎం వైఎస్ జగన్.!

శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అభివర్ణించింది గతంలో అధికార వైసీపీ. అసలు శాసన మండలి అవసరమే లేదంటూ ఏకంగా శాసన మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ, ఇప్పుడు అదే శాసన మండలి ‘అవసరం’ గుర్తెరిగినట్టుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

శాసన మండలి రద్దు దిశగా గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శాసన మండలి రద్దు తీర్మానానికి సంబంధించి ఉప సంహరణ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

‘మాట తప్పడు.. మడమ తిప్పడు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పదే పదే వైసీపీ నేతలు చెబుతుంటారు. అయితే, ఇలాంటి విషయాల్లో ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మడమ తిప్పేస్తున్నారు.?’ అన్నదానిపై వైసీపీలోనే ఎవరూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.

అమరావతి విషయంలో కూడా అంతే. ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో, అమరావతికి పూర్తి మద్దతు పలికిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అవుతూనే మూడు రాజధానులన్నారు.. అమరావతిపై మంత్రులు అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా, వారిని వారించలేదు.

మూడు రాజధానుల చట్టానికి సంబంధించి నిన్ననే రద్దు తీర్మానం కూడా ప్రవేశపెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మూడు రాజధానులకు అనుకూల నిర్ణయం.. దానికి అనుకూలంగా తీర్మానం.. అనంతరం చట్టంగా అది మారడం.. ఇంతలోనే హైకోర్టు స్టేటస్ కో.. మరోపక్క, శాసన సభ సాక్షిగా అలాగే శాసన మండలి సాక్షిగా మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం.. ఇదంతా గందరగోళ పాలనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

శాసన మండలి వ్యవహారం కేంద్రం పరిశీలనలో వున్న ఈ సమయంలో, రద్దుపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకున్న దరిమిలా, కేంద్రమెలా స్పందిస్తుందో వేచి చూడాలి.