2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని అంగీకరించడానికి కొంత సమయం తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ వ్యూహాలను రచించే పనిలో నిమగ్నమయ్యారు. మొన్న జరిగిన మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ…గత ఐదేళ్లలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ గడిచిన 14 నెలలో జగన్ చేసిన అభివృద్ధి ఎంతో చెప్పాలని ప్రశ్నించారు . ఇప్పుడు ఈ ప్రశ్నించే విధానాన్ని యనమల కూడా అవలంభిస్తున్నారు.
పోలవరానికి పునాదులు కూడా లేవని గతంలో వ్యాఖ్యానించిన జగన్ ఇప్పుడు ఎక్కడ గేట్లు పెడుతున్నాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. వంశధార-నాగావళి పనులు జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.64 వేల కోట్లు సాగునీటి రంగానికి కేటాయించి, పోలవరం ప్రాజెక్టుని 70 శాతం పైగా పూర్తి చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో పట్టిసీమకు అడ్డుపడిన వారు, నేడు అదే పట్టిసీమపై ఆధారపడటం సిగ్గుచేటన్నారు. పట్టిసీమ ద్వారానే పులివెందులకు చంద్రబాబు నీళ్లిచ్చారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో దోచుకున్న 32 వేల ఎకరాలను అమ్ముకోవడానికే అక్కడ రాజధాని అంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే కరోనా కట్టడిలో కేసుల ప్రభుత్వం విఫలమైందని, కరోనా ఖర్చులకు రూ.4,800 కోట్లు అయినట్లు చెబుతున్న జగన్, కేంద్రం ఇచ్చిన కరోనా నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న కాలంలో ప్రజలు జగన్ కు బుద్ది చెప్తారని యనమల తెలిపారు. ఇప్పటి వరకు అనవసరపు ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులు, గత కొన్ని రోజుల చాలా తెలివిగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని, తాము చేసిన అభివృద్ధిని చెప్తూ, జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అడగటం సరైన వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తాజా యనమల పోలవరం గురించి అడుగుతున్న ప్రశ్నలు కూడా సరైనవని, వాటికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని సామాన్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈసారి పోలవరం పోరు రాష్ట్రంలో ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.