Serial Artist: ఇండస్ట్రీలోకి ఎప్పుడూ కొత్త నీరు వస్తూ ఉంటుంది అనేది సహజం. కానీ పరభాషా నటుల ఉనికి ఎక్కువైపోయిందని సీరియల్ నటుడు అవినాష్ అన్నారు. ఇంతకుముందైతే కేవలం హీరోయిన్లు మాత్రమే వేరే ప్రాంతాల నుంచి వారని, కానీ ఇప్పుడు హీరోలతో పాటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా అక్కడి నుంచే వస్తున్నారని ఆయన తెలిపారు. హీరోయిన్ల విషయంలో అయితే ఓకే.. ఎందుకు అంటే ఇక్కడున్న తెలుగు కుటుంబాల నుంచి ఒక అమ్మాయిని ఇండస్ట్రీకి పంపించాలంటే ఒప్పుకోరు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా సేఫ్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. అయినా కూడా చాలా మంది ఇండస్ట్రీకి అమ్మాయిలను పంపించాలంటే చాలా ఆలోచిస్తారని ఆయన అన్నారు. హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి అవతలివారికి అవకాశం ఇస్తున్నారు అంటే పర్లేదు. కానీ ఈ రోజు చూస్తే ఎంతో మంది మంచి పర్సనాలిటీ ఉండి, టాలెంట్ ఉండి కూడా ఇప్పటికీ ఫొటోలు చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్లుండాల్సిన స్థానంలో వాళ్లను కూడా బయటినుంచే వస్తున్నారని ఆయన అన్నారు. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కూడా అక్కడి నుంచే వస్తున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని అవినాష్ చెప్పారు.
మామూలుగా అయితే ఒక ఆర్టిస్ట్ కొన్ని దశల్లో ఒక్కో క్యారెక్టర్ చేయాలని అనుకుంటాడు. అలా అన్ని పాత్రలూ చేయాలనుకుంటామని, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని ఏ ఛాన్స్ వచ్చినా చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ చాలా మంది ఆర్టిస్ట్‌లు మంచి ఫిజిక్ ఉన్నవారు, మెయింటైన్ చేస్తున్న వాళ్లున్నారన్న అవినాష్, వాళ్లు కూడా పాథర్ క్యారెక్టర్ చేస్తున్నారని, ఎందుకూ అంటే బతకాలి కదా తప్పదు మరి అని ఆయన వ్యాఖ్యానించారు. ఏం దౌర్భాగ్యమో ఏమో తెలియదు గానీ చాలా నోటెడ్ పర్సన్స్‌కి కూడా ఇప్పుడు అవకాశాలు దొరకడం కష్టమవుతోందని ఆయన అన్నారు. బయటి వాళ్లు వచ్చినప్పటి నుంచి తమకు చాలా పని తగ్గిపోయిందని ఆయన చెప్పారు.
ఆ పరభాషా సంస్కృతి ఎందుకొచ్చిందో తనకు తెలియదు గానీ, అది సినిమాల్లోకే కాదు సీరియల్స్‌లోకి కూడా వచ్చిందని అవినాష్ అన్నారు. ఇక్కడ ఆర్టిస్ట్‌లు లేరా అంటే అదీ కాదు కదా చాలా మంది ఉన్నారు అని, కానీ వారిని కాదని వేరే వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. బడ్జెట్‌తో పోల్చుకున్నా కూడా లోకల్ వాళ్ల కంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్లకిచ్చే అలవెన్సులు, రెమ్యునరేషన్లే ఎక్కువ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అయినా కూడా ఈ విష సంస్కృతి మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ ఉందని, రానున్న రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా వేరే రాష్ట్రం, లేదా ప్రాంతాల నుంచి వస్తారేమో అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
