శుభకార్యం లేదా పనులు ప్రారంభించడానికి శుభసమయం చాలా ముఖ్యమైంది. దీనికి కారణం.. ఏదైనా ఆటంకం వచ్చినా ముహూర్తబలంతో ఆ కార్యం పూర్తవుతుంది. దీనికి ప్రకృతిలోని శక్తులు సహకరిస్తాయని పెద్దల విశ్వాసం. అటువంటి అద్భుత ముహూర్తాలలో గోధూళి ముహూర్తం గురించి తెలుసుకుందాం.. సూర్యుడున్న ముహూర్తము నుండి ఏడోది గోధూళికా ముహూర్తమని పిలుస్తారు. విపులంగా చెప్పాలి అని అంటే పూర్వం పశువులు ఎక్కువగా ఉండేవి. ఉదయాన్నే ఊరి బయటకు మేత కొరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు. అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది.
అలాంటి సమయమును గోధూళికా ముహూర్తముగా పిలిచేవారు. సాయంకాలం 4.30 నిమషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈ సమయం. దీనినే గోధూళికా ముహూర్తము అని అంటారు. ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును . వర్జ్యము , దుర్మూహర్తములతో పనిలేదు. హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని “గోధూళి వేళ” అని, “అసుర సంధ్య” అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం. సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్చరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు. ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వం తో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు. సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి, నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.