ప్రకృతిలోని ఆకాశ జాతులకు రాజులంటూ అనేక పెద్ద పక్షులు గురించి మీరు వినే ఉంటారు. కానీ ఒక బియ్యం గింజ కన్నా తక్కువ బరువు ఉండే ఓ పక్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారు.. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదే ‘బీ హమ్మింగ్‌బర్డ్’. క్యూబా దీవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షి, ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా గుర్తింపు పొందింది. దీని పొడవు కేవలం 5 నుంచి 6 సెంటీమీటర్లు మాత్రమే. బరువు కూడా 1.5 గ్రాములకే ఉంటుంది.
ఇది తేనెటీగల శబ్దం చేసేలా రెక్కలు కొట్టే సామర్థ్యం కలిగిన ఏకైక పక్షి. ఒక సెకనులో 80 సార్లు రెక్కలు కొడుతూ, వెనకకు ఎగిరే గుణం కూడా దీనికి ఉంది. పువ్వుల్లో మకరందాన్ని పీల్చుకుని వెంటనే వెనక్కి వెళ్లి మరో పువ్వు మీద కూర్చుంటుంది. ఇది సాధారణ పక్షులకు సాధ్యం కాదు. మగ బీ హమ్మింగ్‌బర్డ్స్ తల, మెడ ప్రాంతంలో ప్రకాశవంతమైన ఎరుపు, నీలం ఈకలతో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఆడ పక్షులు కొంచెం మసకబారిన రంగులో ఉంటాయి. ఈ చిన్న పక్షులు తమ గూళ్లను సాలీడు వలలతో చెట్ల కొమ్మలపై నిర్మిస్తాయి. ఒక్కసారి రెండు చిన్న గుడ్లను మాత్రమే పెడతాయి.
అయితే ఈ అద్భుత పక్షి మనకు లభించకపోవడానికి కారణం దాని ఆవాసాల నాశనం. అడవుల నరికి తక్కువవుతున్నందున, వ్యవసాయం, పురుగుమందుల వాడకం వీటిని ముప్పుకు గురి చేస్తున్నాయి. ప్రకృతిలో అతి చిన్న జీవి ఇలా కనుమరుగవకుండా అందరం కూడా దానికి సంరక్షణ కవచం కావాలి. ఈ చిన్న చింతకాయ లాంటి పక్షి, మనకు ప్రకృతితో స్నేహం చేయమని పాఠం చెబుతోంది.