ఎవరీ పరుచూరి మల్లిక్.. ఎందుకింతలా భయపెడుతున్నాడు.?

Paruchuri-Mallik

మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా తీవ్రంగా వుండబోతోందని పరుచూరి మల్లిక్ అనే వ్యక్తి న్యూస్ ఛానళ్ళలో హంగామా చేశాడు. డాక్టర్ల మాటల్ని సైతం పట్టించుకోలేదు. ‘మనం మనకి తెలిసిన విషయాల్ని నెమ్మదిగా చెప్పాలి.. గట్టిగా, బిగ్గరగా హడావిడి చేసి చెబితే, జనం భయపడతారు. రోగం కంటే ఒక్కోసారి భయమే ప్రమాదకరంగా మారుతుంది..’ అని వైద్యులు చెప్పినా వినలేదు.

దేశంలో సెకెండ్ వేవ్ సమయంలో స్వైర విహారం చేసిన వేరియంట్ అత్యంత ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ కారణంగా దేశంలో ప్రతి ఒక్కరూ తమ సన్నిహితుల్ని కోల్పోయారు. ఇది నిష్టుర సత్యం. మూడో వేవ్ గనుక వస్తే, ఇంటికొకరు చచ్చిపోవడం ఖాయమంటూ పరుచూరి మల్లిక్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ‘వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు.

కొత్త వేరియంట్ వచ్చేసిందట. మూడో వేవ్ చాలా ప్రమాదకరమట..’ అంటూ జనంలోనూ చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ, సంచలనాల కోసం పరుచూరి మల్లిక్ అనే వ్యక్తికి అదనపు పబ్లిసిటీ ఇచ్చేయడం చూస్తున్నాం. దాంతో, పరుచూరి మల్లిక్ వ్యాఖ్యలు జనంలోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయాయి. అసలు ఎవరీ పరుచూరి మల్లిక్.? అని జనం ఆరా తీయడం మొదలైంది. మరోపక్క, ఈయన మీద కేసు నమోదయినట్లు తెలుస్తోంది.

ప్రజల్ని భయపెట్టేలా వ్యవహరిస్తున్నాడంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారట హైదరాబాద్ పోలీసులు. ‘నేను మేధావిని.. అధ్యయనాల్ని ఫాలో అవుతున్నాను. ఆ వివరాల్ని మీ ముందుంచుతున్నాను..’ అని చెప్పే క్రమంలో అస్సలేమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పరుచూరి మల్లిక్ విషయంలో ప్రజలూ అప్రమత్తంగా వుండాలి. ఆశ క్యాన్సర్ వున్నోడ్ని బతికించే అవకాశముంది.. భయం అల్సర్ వున్నోడిని కూడా చంపేసే ప్రమాదముంది.