కరోనా మూడో వేవ్ వచ్చి తీరుతుంది.. సెకెండ్ వేవ్ కంటే అది చాలా తీవ్రంగా వుండబోతోంది.. దాని తీవ్రత తగ్గించాలంటే, వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరగాలి.. ఇదీ నిపుణులు చెప్పిన మాట. మూడో వేవ్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని పలు అధ్యయనాలూ స్పష్టం చేశాయి. ఓ మేధావి అయితే ఇంటికో మరణం మూడో వేవ్ కారణంగా సంభవిస్తుందంటూ న్యూస్ ఛానళ్ళలో భయపెట్టే ప్రకటనలు ఇస్తున్నాడు.. ఇంతకీ, మూడో వేవ్ వస్తుందా.? రాదా.? నిజానికి, మూడో వేవ్ అనేది జనం నడవడికపైనా, ప్రభుత్వాల చర్యలపైనా ఆధారపడి వుంటుంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియల్లో అస్సలేమాత్రం వేగం కనిపించడంలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ (18 ఏళ్ళు పైబడినవారికి) అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతానికైతే కేంద్రం రాష్ట్రాలకు కోటా కింద కొంత మేర మాత్రమే ఉచితంగా అందిస్తోంది. మిగతా వ్యాక్సిన్లను రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి వుంది. కానీ, ఆ పరిస్థితి రాష్ట్రాలకు లేకుండా పోయింది రకరకాల కారణాలతో. ఇదిలా వుంటే, దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 70 వేల లోపు మాత్రమే రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు గత కొద్ది రోజులుగా నమోదవుతుండడం కాస్త ఉపశమనమే.
కానీ, వేవ్ అనూహ్యంగా పుంజుకోవడానికి పెద్దగా సమయం పట్టడంలేదు. కరోనా సెకెండ్ వేవ్ విషయంలో అది స్పష్టంగా మనకి అనుభవమైంది. మూడో వేవ్ అంతకన్నా దారుణంగా వుంటుందన్న అంచనాల్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండడమే అసలు సిసలు మెడిసిన్. కానీ, సడలింపుల తర్వాత విచ్చలవిడితనం జనాల్లో కనిపిస్తోంది.రాజకీయ కార్యక్రమాలూ ఊపందుకున్నాయి. దాంతో, మూడో వేవ్ ఏ క్షణాన అయినా విరుచుకుపడ్డానికి అవకాశాలు ఎక్కువగానే వున్నాయని అర్థమవుతోంది.