Crime News: ఏ విధమైన కష్టం చేయకుండా సులభమైన మార్గం లో డబ్బు సంపాదించడానికి చాలా మంది దొంగతనాలు చేస్తూ ఉంటారు.ఇల్లు,దుకాణాలు ఏటీఎం, బ్యాంకులు, వాహనాలు ఇలా వేటినీ వదలకుండా చాన్సు దొరికితే చాలు దొంగతనానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత అడ్డ దారిలో వెళ్తూ వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. తాజా గా ఇద్దరు యువకులు ఏకంగా ఏటీయం దొంగతనానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, కూచిపూడి గ్రామంలో ఇద్దరు యువకులు ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది.గ్రామంలో ఇద్దరు యువకులు ఏటీఎం లోకి ప్రవేశించి చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఏటీఎం ని ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించగా ఏటీఎం లో ఉన్న అలారం మోగడంతో యువకులు ఇద్దరు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడి నుండి ఎవరికీ చిక్కకుండా పరారయ్యారు.
ఏటీఎం నుండి అలారం శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించగా ఎటిఎం ధ్వంసం కావడంతో వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు బ్యాంకు సిబ్బందికి అందించారు. బ్యాంకు సిబ్బంది పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే అక్కడ ఏటీఎం నుంచి ఎటువంటి డబ్బు దొంగతనం కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.