అవమానిస్తున్నదెవర్ని.? అమరావతినా.? ఆంధ్రప్రదేశ్‌నా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సమీప భవిష్యత్తులో మరో రెండు రాజధానులు రాష్ట్రానికి అదనంగా వస్తాయా.? రావా.? అన్నది వేరే చర్చ. ఒకవేళ అదనంగా రెండు రాజధానులు వచ్చినా, అప్పుడు కూడా అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగానే వుంటుంది.. కాకపోతే, రాజధాని అమరావతి కాస్తా, శాసన రాజధాని అమరావతి అవుతుందంతే.

ఈమాత్రందానికి అమరావతిని కమ్మరావతి అనడమెందుకు.? అమరావతిని శ్మశానంగా అభివర్ణించడమెందుకు.? అమరావతిని ఎడారిగా పేర్కొనడమెందుకు.? వీటి వల్ల అధికార వైసీపీ ఏం సాధిస్తుంది.? అమరావతిని అవమానించడమంటే, కన్న తల్లిని అవమానించడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించడమేనన్న సోయ, అధికార వైసీపీ నాయకులకు ఎప్పుడు వస్తుందో ఏమో.!

సాక్సాత్తూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో నివాసం వుంటున్నారు. అలాంటప్పుడు అమరావతి ఎలా కమ్మరావతి అవుతుంది.? అన్న ఇంగితం కూడా లేనోళ్ళు అధికార పార్టీలో కీలక పదవుల్లో చెలామణి అవుతున్నారు. అధినేత మెప్పుకోసం వైసీపీ నాయకులిలా దిగజారుతున్నారా.? లేదంటే, అధినేత స్వయంగా వాళ్ళని అలా ప్రోత్సహిస్తున్నారా.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

మూడేళ్ళుగా అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఏమీ చేయలేకపోయింది.. కేసులు పెట్టడం తప్ప. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. అమరావతిపై ఆరోపణలు కూడా అలాంటివేనని అనుకోవాల్సిందే కదా.? నిరూపితమైతేనే అది నేరం. అప్పటిదాకా అది నేరం కాదు. మరి, అమరావతిని ఎందుకు నేరస్తురాలిని చేయడం.?

శాసన రాజధాని అమరావతిని అభివృద్ధి పథంలో నడిపిస్తే, పేరు వచ్చేది వైసీపీకే. కానీ, వైసీపీ ఆ పని చేయలేకపోతోంది. ఒక్క రాజధానికే దిక్కు లేదు.. ఇంకో రెండు రాజధానులట.. అన్న పలచన భావం ప్రజల్లో వైసీపీ పొందుతోంది. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?

బోల్డంతమంది సలహాదారులున్నారు.. వాళ్ళ కోసం కోట్లు ఖర్చువుతున్నాయ్.. ఎవరూ ప్రభుత్వ పెద్దలకు సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారా.? అన్న డౌటానుమానం ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంటుంది.