ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసేవారే లేరు.. బాబుకు చెప్పుకోలేని కష్టం

నారా చంద్రబాబునాయుడు
అధికారంలో ఉన్నా లేకున్నా నియోజకవర్గాల్లో బలమైన నాయకుల నాయకత్వం ఉంటే ఇప్పుడు కాకపోతే రేపైనా కుర్చీలో కూర్చోవచ్చనే ధీమా అయినా ఉంటుంది.  ఇప్పుడు ఆ ధీమానే తెలుగుదేశం పార్టీకి కరువవుతోంది.  పలు నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపే నాయకులు లేక తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటోంది పార్టీ.  శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసేవారే లేకుండాపోయారు.  గత ఎన్నికల్లో శ్రీకాకుళం టెక్కలి నుండి రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుది కూడా ఆ జిల్లానే.  అలాంటిది ఆ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పార్టీకి ప్రాతినిథ్యం వహించే వారే లేకుండా పోయారు. 
నారా చంద్రబాబునాయుడు
 
రాజాం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కొండ్రు మురళీ పోటీచేసి ఓటమి పాలయ్యారు.  అప్పటి నుండి ఆయన పార్టీని పట్టించుకోవడం మానేశారు.  అసలు గత ఎనికల్లో కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు టికెట్ దక్కాల్సింది మురళికి దక్కింది.  ప్రతిభా భారతి 2009, 2014 నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.  గత ఎన్నికల్లో కుమార్తెకు టికెట్ అడగ్గా కాంగ్రెస్ నుండి పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళికి అవకాశం ఇచ్చారు.  కానీ వైసీపీ నేత కంబాల జోగులు చేతిలో ఓటమి పాలయ్యారు.  అప్పటి నుండి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  
 
వీలుంటే ఇప్పటికిప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతారనే టాక్ ఉంది.  మరోవైపు ప్రతిభా భారతి ఫ్యామిలీ సైతం తన కుమార్తెకు టికెట్ ఇవ్వని పార్టీ కోసం తామెందుకు కష్టపడాలి, అసలు చంద్రబాబు తమని పట్టించుకుంటే కదా అన్నట్టు మౌనంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసేవారే లేకుండా పోయారు.  దీంతో అంతా వైసీపీ హవానే నడుస్తోంది. ఆ పార్టీకి ఎదురెళ్లేవారు లేకపోయారు. ఇలాగే ఇంకొన్నాళ్లు సాగితే పార్టీ కాలగర్భంలో గడిచిపోవడం ఖాయమంటున్నారు.  మరి ఈ గడ్డు పరిస్థితిని బాబుగారు ఎలా డీల్ చేస్తారో చూడాలి.