అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.!

చిరంజీవి సర్జా.. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. కొన్నాళ్ళ క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తాజాగా మరో కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఈ రెండు ఘటనల గురించీ ‘కన్నీటితో కూడిన చర్చ’ జరుగుతోంది.

పునీత్ రాజ్ కుమార్ వయసు 46 ఏళ్ళు.. చిరంజీవి సర్జా అయితే ముప్ఫయ్‌లలోనే ప్రాణాలు కోల్పోయాడు. శరీరాన్ని ధృఢంగా వుంచుకునే క్రమంలో అత్యంత కష్టతరమైన వ్యాయామం చేయడమే ఈ హఠాన్మరణాలకు కారణమన్న అభిప్రాయాలు వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురైన విషయం విదితమే. గత కొంతకాలంగా.. కాదు కాదు చాలాకాలంగా కష్టతరమైన వ్యాయామం చాలా సులువుగా చేసేస్తూ వచ్చాడు పునీత్ రాజ్ కుమార్. ఎప్పుడూ ఫిట్‌గా వుండటానికే ప్రాధాన్యతనిస్తాడు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు పునీత్.

అసలు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోవడమేంటి.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీలు ఎప్పుడూ వైద్యుల పర్యవేక్షణలోనే వుంటారు.. ఖరీదైన వైద్యం ఎప్పుడూ వారికి అందుబాటులో వుంటుంది. మరి, పునీత్ రాజ్‌కుమార్ ఎందుకు గుండెపోటుతో చనిపోయారు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

గతంలో పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ కూడా గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన శివ రాజ్ కుమార్ అప్పట్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ విషయాన్ని ఇప్పుడు పునీత్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

పునీత్ రాజ్ కుమార్ అంటే కేవలం కన్నడ సినీ నటుడు మాత్రమే కాదు.. అంతకు మించి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ అలాగే కోలీవుడ్ వరకూ ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులకు అత్యంత సన్నిహితుడు. అందుకే, పునీత్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.. అందరి కళ్ళనీ చెమర్చేలా చేస్తోంది.