అధికారంలో వున్నోళ్ళు తమ జేబుల్లోంచి డబ్బులు తీసి, పరిపాలిస్తారా.? కాస్తంత ఇంగితం కూడా అధికారంలో వున్నోళ్ళకు వుండదు. లేకపోతే, ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, తమ పేర్లు పెట్టుకోవడమేంటి.? నిజానికి, ఇంగితం లేనిది పాలకులకే అయినా, విజ్ఞత కోల్పోతున్నది ప్రజలు. ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేస్తున్నాం.? అన్నది ఆలోచించుకోకపోతే.. ఇదిగో ఇలాగే తగలడుతుంది వ్యవహారం.
ఓటుకు రెండు వేలో, ఐదు వేలో పారేస్తే చాలు.. ఓట్లేసేస్తాం.. తమ కులపోడు కాబట్టి ఓట్లేసేస్తాం.. తమ మతానికి చెందినోడు కాబట్టి ఓట్లేసేస్తాం.. అని జనం ఆలోచనలు అక్కడే ఆగిపోబట్టి, అధికారంలో వున్నవాళ్ళ పేర్లు సంక్షేమ పథకాల ముందు చేరుతున్నాయ్. లేకపోతే, చేరేవా.? ఛాన్సే లేదు.
ఏమో, ప్రజల సొమ్ముని సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం కదా.. మా పేర్లు పెట్టుకుంటే ప్రజలు నిలదీస్తారేమో.. అన్న భయం పాలకుల్లో లేకుండా పోయింది. ఇప్పుడేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పేరునీ, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునీ సంక్షేమ పథకాలకు పెట్టుకుంటున్నారు కాబట్టి.. అన్న కోణంలో నడుస్తున్న విశ్లేషణ కాదిది.!
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఎందుకు.? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ, రేషన్ విషయంలో నరేంద్ర మోడీ పేరు ఎందుకు చెప్పడంలేదంటూ కలెక్టర్‌ని నిలదీయడమేంటి.? అసలు వ్యవస్థలు ఎంతలా భ్రష్టుపట్టిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కాస్తా, ఎన్టీయార్ వైద్య సేవ అయ్యింది.. మళ్ళీ ఇప్పుడది వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జేబుల్లోంచి ఆ ఖర్చు చేయలేదు.. ఆ తర్వాత చంద్రబాబూ ఆ సొమ్ముల్ని తన జేబుల్లోంచి తీయలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సొంత సొమ్ములు తీసి సంక్షేమ పథకాలు అమలు పరచడంలేదు. వ్యాక్సినేషన్ కోసం నరేంద్ర మోడీ సైతం సొంత సొమ్ముల్ని వెచ్చించలేదు.చంద్రన్న కానుక అంట.. జగనన్న కానుక అట.. జనం పేరుతో అప్పులు చేసి, ఆ జనానికి పంచి పెడుతూ, దాన్ని కానుక అనడానికి కాస్తంత ఇంగితం వుండాలి.
మరెందుకు రాజకీయ నాయకులకు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ.? కోర్టులే జోక్యం చేసుకుంటాయో, ప్రజలే తిరగబడతారో.. ఖచ్చితంగా మార్పు రావాల్సిందే.