బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి.
వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి.
ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్‌ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.