Theaters Closed : థియేటర్లు మూసేస్తున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పరిస్థితేంటి.?

Theaters Closed : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతోంది. సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించడం, బెనిఫిట్ షోలకు అవకాశమివ్వకపోవడం, టిక్కెట్ ధరల్ని పెంచుకునే వెసులుబాటు ఇవ్వకపోవడం.. ఇవన్నీ సంక్రాంతి సినిమాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించి కొంత వెసులుబాటు పొందినా, తనిఖీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కలగజేస్తోందంటూ చాలా చోట్ల సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తుండడంతో సినీ పరిశ్రమలో తీవ్ర గందరగోళం నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతి రేసులో నిలబడ్డాయి. ఈ రెండూ పెద్ద సినిమాలే. పైగా, పాన్ ఇండియా సినిమాలు. వీటికి తొలి వారం టిక్కెట్ ధరల్ని పెంచడంతోపాటుగా, అదనపు షోల కోసం కూడా ఆయా నిర్మాతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం వుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమ్మతించే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు.

‘పుష్ప’ సినిమా కోసం తెలంగాణలో అదనపు షోలకు అనుమతిచ్చింది తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో మాత్రం, ‘పుష్ప’ సినిమాకి కనీసం బెనిఫిట్ షోలు కూడా వేసే పరిస్థితి దొరకలేదు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 50కి పైగా థియేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.. ప్రభుత్వం నిర్వహిస్తున్న తనిఖీలు సహా టిక్కెట్ల ధరల వ్యవహారానికి సంబంధించి.

సంక్రాంతి సినిమాల రిలీజులకు పెద్దగా సమయం లేదు. ఈ సమయంలో ఇలాంటి గందరగోళం.. సినీ పరిశ్రమకు అస్సలేమాత్రం రుచించడంలేదు. కానీ, ఏమీ చెయ్యలేని పరిస్థితి. సక్రమంగా నడిచే థియేటర్లపై అభ్యంతరాల్లేవనీ, అక్రమంగా నడిచే థియేటర్లపై కొరడా ఝుళిపిస్తామని ఏపీలో అధికారులు చెబుతున్నారు.