‘టిక్ టాక్’ యాప్ తిరిగి భారతీయ అభిమానులకి చేరువయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. మన దేశంలో భీభత్సమైన పాపులారిటీ తెచ్చుకున్న ఈ చైనా యాప్ ను ఏడాది క్రితం భారత ప్రభుత్వం నిషేధించింది. బోర్డర్ లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ బుద్ది చెప్పేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి చెందిన కొన్ని యాప్ లను మన మార్కెట్ నుండి తొలగించింది. అయితే ఇండియాలో ఉన్న మార్కెట్ ను వదులుకోలేని చైనీస్ కంపెనీలు ఏదొక విధంగా తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో ‘పబ్ జి’ గేమింగ్ యాప్ ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ గా పేరు మార్చుకుని విడుదలైంది.
ఈ క్రమంలోనే టిక్ టాక్(Tik Tok) మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఇప్పుడు ఆ పేరులో స్వల్ప మార్పులని చేసుకుని (Tick Tock)గా వచ్చేందుకు కావాల్సిన అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుందట. మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్ హోస్టింగ్, ఇంటరాక్టివ్ అప్లికేషన్స్, హోస్టింగ్ మల్టీమీడియా అనే డిస్క్రిప్షన్ తో తమ యాప్ కు అనుమతి ఇవ్వాలని బైట్ డ్యాన్స్ జూలై 6న భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని టెక్ నిపుణుడు ముకుల్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. టిక్ టాక్ దూరమవటంతో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షాట్స్ వంటి యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఇవేమి టిక్ టాక్ కు సరితూగలేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టిక్ టాక్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడే రోజు దగ్గర్లోనే ఉన్నట్లుంది.