ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తించే తీరుతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కూడా ఇటువంటి విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ రాయలేదని మూడవ తరగతి చదువుతున్న బాలుడిని ఉపాధ్యాయుడు దారుణంగా చితకబాది స్కూల్ బయటకు పంపించేశాడు. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు భరించలేక ఆ విద్యార్థి స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వివరాలలోకి వెళితే..బిహార్లోని వజీర్ గంజ్-ఫతేపూర్ రోడ్ లో ఉన్న లిటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివేక్ కుమార్ అనే మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి హోంవర్క్ రాయలేదన్న కారణంతో వికాస్ సింగ్ ఉపాధ్యాయుడు వివేక్ ని చితకబాది స్కూల్ నుండి బయటకు తోసేసాడు. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలు భరించలేక చిన్నారి స్కూల్ బయట రోడ్డుమీద స్పృహ తప్పి పడిపోయాడు.
అటుగా వెళుతున్న వ్యక్తి బాలుడిని గుర్తించి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కి వెళ్ళమని డాక్టర్లు సూచించారు. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి శవాన్ని పరీక్షించిన వైద్యులు దెబ్బలు ఎక్కువగా కొట్టడం వల్లే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాలుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని అతడిని విధుల నుండి సస్పెండ్ చేశారు.