పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవం దిశగా అధికార వైసీపీ, తనవంతు కష్టపడుతోంది. ఏకగ్రీవాలు చేయాల్సి వస్తే, అసలు ఎన్నికలు ఎందుకు.? ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.? అన్నది విపక్షాల ఆవేదన. ఎవరి గోల వారిదే. ఏకగ్రీవాలు తప్పు కాదుగానీ, బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరిస్తున్నారు. కానీ, గ్రామాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా వున్నాయి. ఓ పోలీస్ అదికారి, గ్రామస్తుల్ని, కాంప్రమైజ్ చేసేస్తున్నారు ఏకగ్రీవాల కోసం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీలోకి దూకేసిన జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ నేతల్నే పంచాయితీ ఎన్నికల నిమిత్తం బెదిరిస్తున్న వైనం కూడా ఆడియో లీక్ రూపంలో బయటకొచ్చింది. అయితే, ఎమ్మెల్యేని లెక్క చేయకుండా వైసీపీ, అక్కడ అరాచకం సృష్టిస్తోందన్నది ఇంకో వాదన.
సర్పంచ్ అవుదామనే ప్రయత్నంలో గ్రామస్థుల్ని ఒప్పించుకున్న ఓ వ్యక్తి, అధికార పార్టీ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ‘ఎలా ఊళ్ళో తిరుగుతావో చూస్తా..’ అంటూ ఇంకో చోట వైసీపీ నేత, టీడీపీ నేతను బెదిరిస్తున్న వైనం పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో బయటపడింది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ఆడియో టేపులు, వీడియో టేపులు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. కాగా, నామినేషన్లు వేయకుండా అభ్యర్థుల్ని అధికార పార్టీ నేతలు, అధికారులు అడ్డకుంటున్నారనే ఫిర్యాదులూ పెద్దయెత్తున వస్తున్నాయి. అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్‌లో.? పంచాయితీ ఎన్నికల వ్యవహారం రాష్ట్రంలో కొత్త వివాదాలకు తావిచ్చేలా వుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్చరికలకీ, గ్రౌండ్ లెవల్‌లో జరుగుతున్న పరిణామాలకీ పొంతనే లేకుండా పోయింది. బలవంతపు ఏకగ్రీవాలు జరిగిపోతున్నాయి.. బెదిరింపుల వ్యవహారాలూ నడుస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో ఇంతటి దురదృష్టకర పరిస్థితులు ఎప్పుడూ లేవని బాధితులు వాపోతున్నారు. అయితే, అక్కడక్కడా జరుగుతున్న చిన్న చిన్న సంఘటనల్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదనీ, వాటిపై చర్యలు తీసుకుంటున్నామనీ అధికారులు చెబుతుండడం గమనార్హం.