Somu Veerraju : సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ వెనుక అంత కథ వుందా.?

Somu Veerraju : వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా సామాన్యుడ్ని ‘మద్యం’ విషయంలో దోచేస్తోందనీ, అందుకే, తాము అధికారంలోకి వస్తే 70 రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని చెప్పామంటున్నారు సోము వీర్రాజు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ డెబ్భయ్ రూపాయలేట.. కాదు కాదు, యాభై రూపాయలకే ఇస్తారట.. ఇది బీజేపీ జాతీయ విధానమా.? అంటూ, సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్న విషయం విదితమే.

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కూడా సెటైర్లు వేసేశారు ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా. మరోపక్క, దేశవ్యాప్తంగా సోము వీర్రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ పరువు పోయింది కూడా. దాంతో, సోము వీర్రాజు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

మద్యానికి బానిసలైపోయినవారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందనీ, తాము అధికారంలోకి వస్తే.. అలా దోపిడీకి గురవుతున్నవారికి వెసులుబాటు కల్పిస్తామని మాత్రమే చెప్పాననీ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల్ని సహజంగానే కొందరు వక్రీకరించారంటున్న సోము వీర్రాజు, అలాంటివారి వక్రీకరణలు పట్టించుకోనక్కర్లేదంటున్నారు.

డెబ్భయ్ రూపాయలకే చీప్ లిక్కర్.. అనే వ్యాఖ్యలు బీజేపీలో ఇంకెవరన్నా చేస్తే అదో లెక్క. కానీ, సాక్షాత్తూ ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన సోము వీర్రాజు చేయడంతోనే ఇంత దుమారం చెలరేగింది. అయినా, ఏపీలో జీరో స్థాయిలో వున్న బీజేపీకి, సోము వీర్రాజు వ్యాఖ్యలతో అదనంగా వచ్చిన నష్టమేమీ లేదు.

అయితే, తెలంగాణలోనూ అలాగే దేశంలో ఆ పార్టీ బలంగా వున్న ఇతర రాష్ట్రాల్లో మాత్రం.. సోము వీర్రాజు వ్యాఖ్యలు కమలం పార్టీకి చిక్కుల్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి.