Crime News: దేశంలో కరోనా విజృంభించిన సమయం నుండి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పొట్టకూటి కోసం పనులు చేసుకుని బ్రతికే వారికి పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడవలసి వచ్చింది. కుటుంబ పోషణకే అప్పులు చేసి వాటిని తీర్చలేని పరిస్థితిలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడిన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి ఎంతో మంది జంటలు విడిపోయారు. ఇలాంటి ఒక దయనీయమైన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది.
భార్య భర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా క్షణికావేశంలో ఆ భార్య చేసిన పనికి అభం శుభం తెలియని తన కన్న బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. రోలుగుంట మండలంలోని జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు ఆరేళ్ల క్రితం వడ్డిప గ్రామానికి చెందిన సాయి అనే మహిళ తో వివాహం జరిగింది. వీరికి భాను(4),పృథ్వీరాజ్(2) అని కూతురు, కొడుకు. నాగరాజు ఆటో నడుపుకొని తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఏడాది నుండి ఆటో నడపడం వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల భార్యాభర్తలిద్దరూ తాకట్టు పెట్టిన బంగారం విడిపించే విషయానికి గొడవ పడ్డారు.
ఈ విషయంలో మనస్తాపం చెందిన నాగరాజు భార్య క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి యాదవుల వీధిలోని బావిలో తోసేసి.. తాను కూడా దూకేసింది. చివరి క్షణంలో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి తల్లి బిడ్డలను బయటికి తీశారు. పిల్లలు నీటిలో మునగడం వల్ల మరణించారు. సాయి మాత్రం ప్రాణాలతో బయట పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించగా..తన భార్య తోసేయడం వల్లే పిల్లలు చనిపోయారని నాగరాజు పోలీసులకు తెలియజేశాడు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు గొడవ పడటం వల్ల క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాగరాజు భార్య పోలీసుల ఎదుట విలపించింది.