ఆ 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారట.. జగన్ ఏం చేస్తారో?

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 175 స్థానాలకు 175 స్థానాలలో వైసీపీ విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అస్సలు పట్టించుకోవడం లేదు. మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్ లేదా బెంగళూరుకు పరిమితమయ్యారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారు.

అయితే ప్రస్తుత ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఎంత కష్టపడినా వాళ్ల నియోజకవర్గాలలో గెలిచే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు గురించి సీఎం జగన్ చేయించిన సర్వేల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఈ ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ సన్నిహితులు కావడం గమనార్హం.

ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని ఎమ్మెల్యేలతో జగన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను జగన్ స్వయంగా చెప్పడంతో పాటు ఏం చేస్తే తప్పులను సరిదిద్దుకోవచ్చనే విషయాలను సైతం చెప్పారని బోగట్టా. అయితే ఈ ఎమ్మెల్యేలకు జగన్ వైసీపీ తరపున టికెట్ ఇస్తారా? లేదా? చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సైతం వెనుకాడనని ఇప్పటికే జగన్ సంకేతాలు ఇచ్చారు.

జగన్ తమతో చర్చించిన విషయాలను కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితులతో పంచుకుంటూ బాధ పడుతున్నారని తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న అనుభవాల గురించి కూడా జగన్ కు పూర్తి వివరాలు తెలుస్తున్నాయని బోగట్టా. జగన్ 2024 ఎన్నికలకు ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.