కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు మ‌రోసారి సీరియ‌స్

Hight court fires on Telangana government

తెలంగాణ‌రాష్ర్ట ప్ర‌భుత్వంపై హైకోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయింది. ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో తీవ్ర అసంతృని వ్య‌క్తం చేసిన కోర్టు మ‌రోసారి అదే విష‌య‌మై ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోద‌ని ప్ర‌శ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని న్యాయ‌స్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉంద‌ని..దీనికి కార‌ణం చెప్పాల‌ని ప్ర‌శ్నిచింది. కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలికి వదిలేసిందని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

కరోనా బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండి ప‌డింది. అలాగే కరోనా కట్టడి విషయంలో హైకోర్టు ప్ర‌భుత్వాన్ని అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్త‌వాలు దాచిపెట్టి అవాస్త‌వాలు చెబుతున్న‌ట్లు మండిప‌డింది. కోర్టు చివాట్లు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. కోర్టు వ‌రుస పెట్టి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో ప్ర‌భుత్వ త‌రుపు న్యాయ‌వాదులు నీళ్లు న‌మాల్సిన స‌న్నివేశం ఎదురైంది. ఇదే అంశంపై గ‌తంలో కోర్టు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

దానికి తోడు ఇటీవ‌ల ప్ర‌భుత్వ అసుప‌త్రుల్లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డం విఫ‌ల‌మ‌వ్వ‌డం…హెల్త్ బులిటెన్ లో ఎక్కువ టెస్ట్ లు చేయించిన‌ట్లు చెప్ప‌డం వంటివి ప్ర‌జ‌ల్లోసైతం ప్ర‌భుత్వ వ్య‌తిరేకంగా మారింది.ఇక ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ప‌రిస్థితుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రోనాతో ఆసుప‌త్రులు లేక, సరైన వైద్యం అంద‌క ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటే! సీఎం కేసీఆర్ పాత స‌చివాల‌యం కూల్చేసి కొత్త స‌చివాల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం..ఆ నిర్మాణం కోసం 500 కోట్లు కేటాయించ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీ ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది.