Corona third wave: దేశంలో జరుగుతున్న అధ్యయనాల ప్రకారం, పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల దృష్ట్యా, కోవిడ్ -19 మూడవ వేవ్ డిసెంబర్ మధ్య నుండి ప్రారంభమైందని, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని తేలింది. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకుల బృందం నేతృత్వంలో, మహమ్మారి యొక్క మొదటి రెండు వేవ్స్ డేటాను ఉపయోగించి మూడవ వేవ్ గురించి ఒక అంచనా వేయడం జరిగింది.
ఈ బృందం ఇప్పటికే మూడవ వేవ్‌ను ఎదుర్కొంటున్న వివిధ దేశాల డేటాతో పాటుగా, మన దేశంలో రోజువారీ కేసుల డేటాను అధ్యనం చేసి ఇండియాలో మూడవ వేవ్ ప్రభావం, టైమ్‌లైన్‌ను అంచనా వేసింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల ఆధారంగా డెల్టా వేరియంట్ కన్నా ఓమిక్రాన్ విజృంభణ ఎక్కువగా ఉందని, అయినప్పటికీ, ఇప్పుడు ప్రజలలో పెరిగిన రోగనిరోధక శక్తి మరియు టీకాల వల్ల రెండవ వేవ్‌లో కనిపించినంత దారుణ పరిస్థితులు ఉండవని చెబుతున్నారు.
ఇక దేశంలో గత 24 గంటల్లో 6,317 తాజా కోవిడ్ కేసులు మరియు 318 మరణాలు నమోదయ్యాయి మరియు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 318 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,78,3కి చేరింది. అయితే, మొత్తం ఓమిక్రాన్ పాజిటివ్ కేసులలో 90 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 15 రాష్ట్రాలలో ఓమిక్రాన్ గుర్తించబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు 57, మహారాష్ట్ర (54) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.