ఆంధ్రప్రదేశ్ కి సంబధించి అప్పులు ఖర్చుల గురించి కాగ్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుల్లో, ఖర్చుల్లో ఏపీదే తొలిస్థానమని ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే… ఆంధ్రప్రదేశ్ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం.. అప్పుల రూపంలోనే సమీకరించినట్లు కాగ్ గణాంకాలు తేల్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు ఖర్చుచేస్తే.. అందులో 51 రూపాయలు అప్పు రూపంలో తెచ్చుకున్నదే. మిగిలిన కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో ఇలా అప్పు రూపంలో తెచ్చుకున్నది 100 రూపాయలకు 30 రూపాయలు మించలేదు. అక్టోబర్ వరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ లెక్కలు తెలిస్తే తేలిన పరిస్థితిది. కేరళ, తెలంగాణలు దాదాపు 40 రూపాయలు అప్పు రూపంలో తీసుకుని ఖర్చు చేశాయి.
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ఇతర అంశాలను పోల్చి చూసినపుడు ఈ విషయం తెలుస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై పన్ను ఆదాయాలు చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లోనే పన్నుల రూపంలో లభించిన ఆదాయం ఎక్కువగా ఉంది.
బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నదీ ఏపీ మాత్రమే. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, కేరళ ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ సమయంలో అనేక అంచనాలు వేస్తుంటారు రకరకాల కేటగిరీల్లో ఖర్చులు చూపిస్తుంటారు. అయితే అసలు బడ్జెట్‌లో మాత్రం పొంతన లేని విధంగా ఆర్థిక బండి నడుస్తుంటుంది. ఏడాది చివరికి బడ్జెట్ ప్రతిపాదించిన రోజుల్లో చెప్పిన మేరకు ఖర్చు ఉండదు.
కరోనా విజృంభించి ఆర్థిక కార్యకలాపాలు తగ్గినా.. ఏపీలో బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. వంద రూపాయలు ఖర్చు చేస్తామని ప్రణాళిక రూపొందిస్తే… ఏపీలో తొలి ఏడు నెలల్లో ఇప్పటికే దాదాపు 56 రూపాయలు ఖర్చు చేశారు. కర్ణాటకలో 53, కేరళలో 49 రూపాయలు ఖర్చు చేశారు. ఇక చాలా రాష్ట్రాలు అంచనాలకు దూరంగానే ఉన్నాయి.
సరిగ్గా సీఎం జగన్ పుట్టినరోజుకి ఒకటి రెండు రోజులు ముందు ఈ నివేదిక బయటకు రావటం ఒక రకంగా కొంచం ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. అయితే సామాన్య ప్రజానీకానికి ఇలాంటి లెక్కలు పెద్దగా పట్టించుకోరు కాబట్టి దీని ప్రభావం పెద్దగా కనిపించటం లేదు.