ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది.? ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం.. భూమా కుటుంబాన్ని వివాదాల్లోకి నెట్టేసింది. రాజకీయంగా వేసిన తప్పటడుగు, భూమా కుటుంబాన్ని అభాసుపాల్జేసింది. భూమా నాగిరెడ్డి.. ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ పార్టీలో వున్నా నిబద్ధతతో పని చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి విజయం సాధించిన విషయం విదితమే. అయితే, ఎన్నికల ప్రచార సమయంలోనే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా.. ఆమె విజయం సాధించారు. తల్లి మరణంతో ఖాళీ అయిన సీటు నుంచి అఖిలప్రియ తేలిగ్గానే గెలిచేశారు. ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, భూమా నాగిరెడ్డి తన కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరిపోయారు. మంత్రి అవుదామనుకున్న నాగిరెడ్డి కోరిక తీరలేదు.
భూమా నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది.. టీడీపీ హయాంలో. అక్కడి నుంచే రాజకీయంగా భూమా కుటుంబం పతనాన్ని చూడటం మొదలెట్టింది. ఒక్కో అడుగూ కిందికి దిగుతూ.. ఇప్పుడు పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కుపోయింది. అఖిలప్రియ భర్త, అఖిలప్రియ సోదరుడు.. పలు కేసులు ఇరుక్కుపోయారు.. అదీ తెలంగాణలో.
ఆయా కేసుల్లో సాక్ష్యాలు బలంగా కనిపిస్తుండడంతో అఖిలప్రియ, అదంతా రాజకీయ కుట్ర.. అని ఆరోపిస్తున్నా ఉపయోగం వుండడంలేదు. మరోపక్క టీడీపీ నుంచి అఖిలప్రియ కుటుంబానికి తగిన మద్దతు లభించడంలేదు. అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి పార్టీ మారకుండా వుండి వుంటే.. ఈ రోజు పరిస్థితి ఇంకోలా వుండేది.. వైసీపీలో ఆ కుటుంబానికి తగిన గౌరవం దక్కి వుండేది. భూమా బ్రాండ్ ప్రతిష్ట మరింత పెరిగేది.