Pan India Cinema : అసలు ప్యాన్ ఇండియా అంటే ఏమిటీ.? ఎందుకీ రచ్చ.?

Pan India Cinema : ‘ప్యాన్ ఇండియా’ అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. అసలింతకీ ప్యాన్ ఇండియా అంటే ఏంటీ.? ఇప్పుడే కొత్తగా ఆవిష్కరించబడిందా ఈ పదం..? అంటే, కానేకాదు, అప్పుడెప్పుడో కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్ తదితర హీరోల సినిమాలు రకరకాల భాషల్లో రిలీజయ్యాయ్. మరి, వాటిని ప్యాన్ ఇండియా సినిమాలే అనాలి కదా.

కానీ, ఇప్పుడే ఎందుకు ప్యాన్ ఇండియా సినిమాల గురించీ, ప్యాన్ ఇండియా స్టార్‌డమ్ గురించి మాట్లాడుకుంటున్నామెందుకు.? గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ నటించిన కొన్ని కొన్నిసినిమాలు కూడా హిందీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ లెక్కల్లో వాళ్లు కూడా ప్యాన్ ఇండియా స్టార్లేగా. కానీ, ఇప్పుడు మాత్రం ఇదో వాడుక పదంగా మారిపోయింది.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. ఇప్పుడంటే ఆయన అడల్ట్ డైరెక్టర్ అయిపోయారు కానీ, అప్పట్లో ‘శివ’ సినిమా అదో పెద్ద సంచలనం. అలాగే రజనీకాంత్ నటించిన ‘రోబో’ కూడా. తమిళ నటుడు విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాని హిందీతో సహా అన్నిభాషల్లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కొత్తగా జరుగుతున్న’ప్యాన్ ఇండియా’ అన్న ఈ ప్రచారం వల్ల ఇండస్ట్రీల మధ్య గ్యాప్ దారుణంగా పెరిగిపోతోంది. ఈ పెనుమార్పు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకే, తెలియకుండా అతిపెద్ద నష్టానికి దారి తీస్తోందంటూ, కొందరు సినీ మేథావులు అభిప్రాయపడుతున్నారు.

ప్యాన్ ఇండియా పేరు చెప్పి సంపాదించుకున్న క్రేజ్, స్టార్‌డమ్ ఎంతకాలముంటుందో తెలీదు. ఆ తర్వాత ఏంటి పరిస్థితి.? ఇప్పటికే ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రబాస్ తదితర స్టార్స్ ఆ పేరును నిలబెట్టుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్షంగా చూస్తున్నాం.

అసలు సినిమా అంటేనే బౌండరీస్ లేనిది.  అలాంటిది ప్యాన్ ఇండియా పేరు చెప్పి, బౌండరీ గీసేసుకుంటే, అందులోంచి బయటికి వచ్చేదెలా.? సో, ‘ప్యాన్ ఇండియా’ అనే మాట గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో.. అని ఓ వర్గం సినీ మేధావులు హెచ్చిరిస్తున్నారు.