రాజకీయాల్లో విజయశాంతి ఫెయిల్యూర్ వెనుక.!

ఆమెకు ఇంకేం కావాలి.? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎంపీ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళ పాటు స్టార్ క్యాంపెయినర్ అనిపించుకున్నారు.. బీజేపీలోనూ తగిన గౌరవమే పొందారు.? కానీ, ఇంకా ఆమె ఏదో ఆశిస్తున్నారు. అదేంటన్నది ఆమెకైనా తెలుసో లేదో.!

విజయశాంతి తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుంటుంటారు. అదే ఆమె చేస్తోన్న అతి పెద్ద తప్పు. రాజకీయ తెరపై అడపా దడపా కనిపించి, ఊకదంపుడు ప్రసంగాలు చేస్తుంటారు విజయశాంతి. చాలాకాలం క్రితం బీజేపీలో వున్నప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చాక.. కాంగ్రెస్‌లో వున్నప్పుడూ, ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వచ్చాకా.. ఆమ రాజకీయ వ్యూహాలు మారడంలేదు.

తాజాగా బీజేపీలో తననెవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు విజయశాంతి. తానెందుకు మాట్లాడలేకపోతున్నానో పార్టీ నాయకుల్ని అడగాలని విజయశాంతి మీడియాకి సూచించారు. తన సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుందో లేదో తనకు అర్థం కావడంలేదని వాపోయారామె.

అంతేనా, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేదీ అధిష్టానమే నిర్ణయిస్తుందనీ విజయశాంతి సెలవిచ్చారు. కానీ, రాజకీయాల్లో వున్నాక.. నాయకురాలిగా తాను ముందుండి, తన వెనకాల కార్యకర్తల్ని, కింది స్థాయి నాయకుల్ని నడిపించేలా వుండాలి. విజయశాంతికి అది చేతకావడంలేదు.

విజయశాంతికి బోల్డంత సినీ గ్లామర్ వుంది. కేవలం సినిమా గ్లామరుకి ఓట్లు రాలవు. కానీ, ఓట్లు రాల్చేంత టాలెంట్ కూడా ఆమెకు వుంది. కానీ, ఏం లాభం.? అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది విజయశాంతి రాజకీయం. తెలంగాణ రాష్ట్ర సమితిలోనే వుండి వుంటే, ఆమె లెవల్ ఇంకోలా వుండేది. బీజేపీలో సరిగ్గా వున్నా, ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అర్హత ఆమెకుంది.