AP: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పూర్తిస్థాయిలో బలహీన పడిందని చెప్పాలి. ముఖ్యంగా వైసిపి నుంచి చాలామంది కీలక నేతలు బయటకు రావడం కూటమి పార్టీలలో చేరడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చాలా సఖ్యతగా ఉన్నటువంటి విజయ సాయి రెడ్డి పార్టీ నుంచి దూరమయ్యారు, ఆళ్ల నాని బాలినేని వంటి వారందరూ కూడా పార్టీకి దూరమవుతూ కూటమి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లినటువంటి మాజీ మంత్రులలో ఆళ్ల నాని ఒకరు.
ఈయన వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు ఇక 2019 ఎన్నికలలో ఆళ్ల నాని అద్భుతమైన మెజారిటీ సాధించడమే కాకుండా ఈయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా మంత్రి పదవిలో ఉన్నన్ని రోజులు పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్న ఆళ్ల నాని రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో పెద్దగా పార్టీ కార్యకలాపాలలో యాక్టివ్ గా కనిపించలేదు.
2024 ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆళ్ల నాని ఓటమిపాలు కావడంతో ఈయన టిడిపిలోకి వెళ్తున్నారని లేదు జనసేనలోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈయన మాత్రం టిడిపిలోకి అడుగు పెట్టారు.వాస్తవానికి నానిటీడీపీ చేరికను జిల్లాకు చెందిన చాలా మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఆయనను స్వాగతించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాయకులు సర్దుకు పోతారని చంద్రబాబు అనుకున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు.
పేరుకే ఈయన వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లారని చెప్పాలి కానీ టిడిపిలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని అందుకే కనీసం ఒక చిన్న మాట కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఆళ్ల నాని ఉన్నారని తెలుస్తోంది.ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇష్టంతో నే నానిని పార్టీలో చేర్చుకున్నా … లోకల్ క్యాడర్ మాత్రం నానితో కలిసి పని చేసేందుకు పెద్ద ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అందుకే నాని అధికార పార్టీలో ఉన్న ఎలాంటి ప్రాధాన్యం లేని నేతగా మిగిలిపోయారు.