థానోస్ రెడ్డి వర్సెస్ దత్త పుత్రుడు.! ఎవరు రైట్, ఎవరు రాంగ్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉనికిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి కూడా వైఎస్ జగన్ ఇష్టపడటంలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు.. శతృవులు వుండరు. ఈ విషయంలో వైఎస్ జగన్ ఇంకాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచించి వుంటే బావుండేదేమో.!

పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా, ‘దత్త పుత్రుడు’ అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ మీద వైఎస్ జగన్ విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జనసేన నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఎటాక్ వచ్చి పడుతోంది. ఈ మధ్యనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘థానోస్ రెడ్డి’ అంటూ నామకరణం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

రాజకీయంగా పవన్ కళ్యాణ్ బలం ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సినిమా నటుడిగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. క్షణాల్లో ‘థానోస్ రెడ్డి’ అన్న వెటకారం, కోట్లాదిమందికి చేరిపోయేలా చేశారు పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ‘థానోస్ రెడ్డి’ అంశం గురించి పడుతున్న ట్వీట్లు అన్నీ ఇన్నీ కావు.

అవసరమా ఇదంతా.? అన్న విషయమై వైఎస్ జగన్ కాస్త పునరాలోచించుకుంటే మంచిది. ‘జైలు రెడ్డి’ అనీ, ఇంకోటనీ.. వైఎస్ జగన్ మీద టీడీపీ సహా ఇతర విపక్షాలు చేసే వెటకారాలు ఓ యెత్తు.. థానోస్ రెడ్డి.. అంటూ, జనసేనాని చేస్తున్న వెటకారాలు ఇంకో యెత్తు.!

‘మీరు మాకు ఏ రకమైన గౌరవం ఇస్తారో.. మేం కూడా మీకు అదే గౌరవం ఇస్తాం..’ అంటూ జనసేన నేత నాగబాబు, వైఎస్ జగన్ మీద మండిపడుతూ, ‘మీ పేరుని ప్రస్తావించేందుకు మాకూ ఇష్టం లేదు థానోస్ రెడ్డిగారూ..’ అంటూ తాజాగా సెటైర్ వేశారు. ఇక్కడ తప్పెవరిది.? అంటే, ఇద్దరిదీ. దత్త పుత్రుడని పవన్ కళ్యాణ్ మీద వెటకారం చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. అదే సమయంలో, ముఖ్యమంత్రిని థానోస్ రెడ్డి అనడమూ తప్పు.!