అసలే కరోనా..ఆపై సీజనల్ జ్వరాలు. ప్రస్తుతం ఈ రెండింట భయంతో ఆంధ్రప్రదేశ్ లో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఏది సీజనల్ జ్వరం? ఏది కరోనా జ్వరం? తెలియక బెదిరిపోతూ బ్రతకాల్సిన పరిస్థితి. ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే? ఇంకా భయం. ఇలాంటి భయం మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు చేసుకున్న పాపమో ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే? జీవితం ఎలాంటి జోన్ లో ఉందో అర్ధమవుతోంది కదా. తాజాగా ఓసారి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి తలుచుకుంటే గుండె గుబేల్ మంటోంది.
ఇప్పుడా ఆసుపత్రికి వెళ్లాలంటే ఒణికిపోవాల్సి వస్తోంది. ఎందుకంత భయపడటం అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురి గదిలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. అక్కడ మార్చురీ సామర్ధ్యం 20 శవాలకు మాత్రమే. కానీ ప్రస్తుతం అక్కడ 45కి పైగా శవాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఇంకా ఎక్కువే ఉండేవి. అందులో ఇటీవలే కొన్నింటిని సామూహిక ఖననం చేసారు. అయినా ఇంకా 45 శవాలున్నాయి. ప్రస్తుతం ఉన్న బాడీలను తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి చెబుతున్నా! వాళ్లు ముందుకు రావడం లేదు.
కరోనా భయంతోనే ఫ్యామిలీ మెంబర్లు ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. మార్చురీ గదిలో శవాలు సామార్ధ్యానికి మించి ఉండటంతో ఒకదానిపై ఒకటి పడేసి ఉంటారని తెలుస్తోంది. వాటిని ఎలా భద్రపరచాలో అర్ధం కాక సిబ్బంది సహా ఆసుపత్రి వర్గాలు సతమతమవుతున్నాయి. కరోనా రోగుల్ని ఎప్పటికప్పుడు ఓ పక్క ఖననం చేస్తున్నా కొత్త బాడీలు ఎక్కువ అవుతున్నాయని వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియని పరిస్థితి తలెత్తిందని సిబ్బంది చెబుతున్నారు. కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి ఒకవేళ చనిపోతే ఆ బంధువులు కరోనా అనే భయంతో వదిలి వెళ్లిపోతున్నారని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రికి రావడానికి సాధారణ జనం భయపడుతున్నారని..దీనికి తక్షణం ఓ పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని సిబ్బంది కోరారు.