రాజకీయాల్లో కలుపుకుపోవడం కంటే, తెంపుకుపోవడమే ఎక్కువవుతుందంటున్నారు కొందరు వైసీపీ నాయకులు.. ఇదివరకే వైసీపీ గ్రూపు రాజకీయాలతో నిండిపోగా, వలసల వల్ల అది మరింతగా ముదిరిపోయింది.. ఎప్పటి నుండో పార్టీని పట్టుకున్న వారికి, కొత్తగా వలసల పధకంతో వైసీపీలో చేరిన వారికి అసలు పొంతన కుదరడం లేదు.. అదీగాక పదవులు దక్కని వారు అసంతృప్తితో రగిలి పోతున్నారట.. ఇక ప్రజల గుండెల్లో తండ్రిని మించిన తనయునిగా పేరు సాధించుకున్న ఏపీ సీయం జగన్ రాజకీయ తగవులను సరిచేయడంలో కాస్త వెనకబడ్డాడని అనుకుంటుండగా, కీలకమైన గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య సఖ్యత అనే మాటలే కనిపించడం లేదని అంటున్నారట రాజకీయ పరిశీలకులు.
బహుశ ఇప్పటివరకు ఏ జిల్లాలోనూ లేని విధంగా ముగ్గురు మహిళలు వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, వీరిలో ఒకరు మంత్రి పదవి కూడా చేపట్టారు. కానీ ఆశించినంత రేంజ్‌లో ఈ ముగ్గురూ దూసుకుపోతోంది ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదట.. ఇకపోతే మంత్రి మేకతోటి సుచరితకు స్థానికంగా ఉండే నేతలంటే పడడం లేదని, వారితో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే రూమర్ చక్కర్లు కొడుతుంది.. అదీగాక ఇటీవల కాలంలో కొందరు నేతలు అమరావతిపై వివిధ సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, స్పందించక మౌనంగా ఉంటున్నారట సుచరిత.. పోనీ మిగిలిన మహిళా నాయకులను కూడా కలుపుకొని పోతుందా అంటే అదీ లేదు..
ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా తన దారి తనదే అన్నట్టుగా వ్యవహరిస్తు ఎవరితోనూ కలివిడిగా ఉండడం లేదట. ఇలాగే వివాదాలకు తావిస్తున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా అంటి అంటనట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇదేగాక శ్రీదేవి రోజుకో వివాదంలో చిక్కుకుంటోన్న పరిస్థితి ఉంది.. దీంతో కీలకమైన గుంటూరులో ఇప్పటి వరకు ఏపార్టీ సాధించని విధంగా ముగ్గురు మహిళా నేతలను గెలుచుకున్నా అని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీకి కానీ, ఇటు ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా జిల్లాలోని మహిళా వర్గానికి గానీ వీరి వల్ల ఒరిగిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదనే ప్రచారం మొదలైందట..
ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే ఇక్కడ పార్టీ బలహీనపడే అవకాశాలున్నాయని అందువల్ల ఈ ముగ్గురు మహిళలు ఇప్పటికైనా కలిసి కట్టుగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మహిళా ఓటు బ్యాంకు పార్టీకి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకుల భావనట.. ఇకపోతే ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పధకాలతో, ప్రజల మనసులను గెలుచుకున్న వైఎస్ జగన్ వీరి విషయంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..